ముఖ్యమంత్రి స్కామ్ లపై కేంద్రం దృష్టి పెట్టిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆయనకు జైలు జీవితం తప్పదని హెచ్చరించారు. నల్గొండ జిల్లాలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు బండి. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ కారుపై జరిగిన దాడిపై స్పందించారు. పోలీసుల కనుసన్నల్లో టీఆర్ఎస్ గూండాలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
డీజీపీ మహేందర్ రెడ్డి ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయరని.. ప్రభుత్వం ఆయనకు ఫోన్ ఎందుకిచ్చిందో అర్థం కావడం లేదన్నారు బండి. పార్లమెంట్ సభ్యుడిపై దాడి జరిగిందంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్న ఆయన.. శాంతి భద్రతలు గాడి తప్పాయని విమర్శించారు. ముఖ్యమంత్రి వెంటనే ఈ ఘటనపై స్పందించాలని.. ఎంపీపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లాలో యువకుడి ఆత్మహత్య బాధాకరమన్న సంజయ్.. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. కేసీఆర్ ఇంకా ఎంతమందిని బలితీసుకుంటారని ప్రశ్నించారు. 317 జీవోతో ఉద్యోగులు ఆందోళనలతో చనిపోతున్నారన్నారు. ఫాం హౌస్ నుండి ఏడేళ్లుగా బయటకు రాని ముఖ్యమంత్రి.. వెంటనే 317 జీవోని సవరించకపోతే త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని.. కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.
కేసీఆర్ రాష్ట్రంలో జిల్లా జిల్లాకో రూల్ తెస్తున్నారని విమర్శించారు బండి. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో సీఎంకి దిక్కుతోచడం లేదని చురకలంటించారు. నిజానికి మొదటి తెలంగాణ ద్రోహి కేసీరేనని.. కనీసం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఓటింగ్ లో కూడా పాల్గొనలేదని ఆరోపించారు. కేంద్రం ఇస్తున్న నిధులను దారి మళ్లిస్తున్నారని.. దమ్ముంటే ఆ లిస్ట్ బయటకు తీయాలని సవాల్ చేశారు. ప్రధానిని సీఎం ఎన్నోసార్లు కలిశారు… మరి అప్పుడు తెలంగాణకి జరిగిన అన్యాయం గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. లేఖల పేరుతో కేంద్రంపై బురదజల్లడం తప్ప ఇంకేం కాదన్నారు.
ఉప ఎన్నికలు జరిగిన నాగార్జున సాగర్, హుజూర్ నగర్ లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు సంజయ్. టెస్లా కార్ల షో రూమ్ ను హైదరాబాద్ లో పెట్టాలని కేటీఆర్ ఆ కంపెనీ సీఈఓకు ట్వీట్ చేశారని.. కానీ.. షోరూమ్ కాదు కార్ల తయారీ కంపెనీ పెట్టాలని తాము కోరుతున్నట్లు తెలిపారు. మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పెడితే వేల ఉద్యోగాలు వస్తాయన్న ఆయన.. షోరూం, గోదాం పెడితే వాచ్ మెన్ తప్ప వేరే ఉద్యోగాలు ఉండవన్నారు. ఈ మంత్రికి కనీసం ఆ అవగాహన కూడా లేదని కేటీఆర్ పై సెటైర్లు వేశారు బండి.