తుగ్లక్ నిబంధనలతో పోలీసు అభ్యర్థుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం చెలగాటమాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బోర్డు నిర్వాకంతో లక్షలకు పైగా అభ్యర్థులు అర్హత కోల్పోయారని దుయ్యబట్టారు. పోలీసు నియామకాలకు పరీక్షల్లోని లోపాలు, అవకతవకలను సవరించాలని లక్షలాది మంది అభ్యర్థులు కోరుతున్నా.. ప్రభుత్వం స్పందిచకపోవడం ముమ్మాటికి తప్పేనన్నారు.
పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పరీక్షల నిర్వహణ లోపాలు, దేహధారుడ్య పరీక్షల నిబంధనలు వెంటనే సరిదిద్దాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పరీక్ష కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు కరీంనగర్ లో బండి సంజయ్ ని కలిసి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
ఇటీవల పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన దేహధారుడ్య పరీక్షలను.. నోటిఫికేషన్ లో పేర్కొన్న దానికి భిన్నంగార్ టీఎస్ఎల్పీఆర్ బోర్డు నిర్వహించినట్లు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ నిబంధనల వల్ల దాదాపు లక్ష మందికి పైగా అభ్యర్థులు అర్హత సాధించలేకపోయారని మండిపడ్డారు.
తెలంగాణ సర్కార్ చేపట్టిన ఉద్యోగల నియమాక ప్రక్రియ మొదటి నుండి వివాదాలకు తావిచ్చేలా వ్యవహరిస్తుండటం దురదృష్టకరమని అన్నారు. అనేక రాష్ట్రాల్లో లాంగ్ జంప్ డిస్టెన్స్ 3.8 మీటర్లు మాత్రమే ఉండగా.. తెలంగాణలో మాత్రం 4 మీటర్లుగా నిర్ణయించడంలో ఉన్న శాస్త్రీయత ఏంటని ప్రశ్నించారు. యువత ఈ ప్రభుత్వాన్ని క్షమించదని హెచ్చరించారు బండి సంజయ్.