– మదర్సాలను రద్దు చేస్తాం
– మైనారిటీ రిజర్వేషన్లను తీసేస్తాం..
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు ఇస్తాం..
– హిందూ ధర్మ రక్షణ కవచమౌతా!
– తెలంగాణకు పట్టిన శనిని వదిలిస్తా..
– అతి త్వరలోనే రజాకార్ ఫైల్స్
– హిందూ ఏక్తా యాత్రలో బండి
తెలంగాణలో వేలాది ఆలయాలను ధ్వంసం చేశారని.. మసీదులు తవ్వితే శివలింగాలు బయటపడతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్ర ఘనంగా జరిగింది. వేలాది మంది ప్రజలు దీనికి తరలివచ్చారు. ఆశేష జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన బండి.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి సవాల్ విసిరారు.
“తెలంగాణలో ఉన్న మసీదులను తవ్వి చూద్దాం.. శవం మీది.. శివం వస్తే మాది. అందుకు సిద్ధమా?” అని ఛాలెంజ్ విసిరారు. తెలంగాణకు పట్టిన శని పీడను వదిలించి రామరాజ్యాన్ని స్థాపించి తీరుతామని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మదర్సాలను రద్దు చేస్తామని.. మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు వర్తింపజేస్తామని ప్రకటించారు.
అధికారిక భాషగా ఉన్న ఉర్దూను శాశ్వతంగా నిషేధిస్తామన్నారు సంజయ్. తెలంగాణకు పట్టిన శనిని కాషాయంతో కడిగేసి రామరాజ్యం స్థాపించి తీరుతామని ఉద్ఘాటించారు. ఢిల్లీకి రాజైనా ఎప్పటికీ తాను కరీంనగర్ బిడ్డనేనని.. జిల్లా ప్రజలకు ఏ ఆపదొచ్చినా పెద్ద కొడుకుగా ఉంటూ ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటానన్నారు. కొన ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసేందుకు పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో హిందూ సమాజాన్ని కాపాడాలంటూ తనను పంపింది కరీంనగర్ ప్రజలేనని అన్నారు బండి. “ఇప్పటి వరకు కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూశారు.. అతి త్వరలో రజాకార్ ఫైల్స్ సినిమా రాబోతోంది. కుహనా సెక్యులర్ వాదులారా.. మీ కళ్లు తెరిపిస్తాం.. ఔరంగజేబును పూజించే మూర్ఖులున్నారు ఇక్కడ. 15 శాతం ఓట్ల కోసం పొత్తులు పెట్టుకుంటున్న పార్టీలున్నాయి. రజాకార్ల ఆకృత్యాలను, హిందూ సోదరసోదరీమణులను బట్టలిప్పి ఎట్లా బతకమ్మ ఆడించారో వాళ్లందరికీ చూపిస్తాం. తెలంగాణ ఏలుతున్న పాలకులకు కనువిప్పు కలిగాస్తాం” అని చెప్పారు.
దేశంలో ఎక్కడ బాంబు దాడులు జరిగినా ఇక్కడే మూలాలుంటున్నాయని అన్నారు బండి. ఉగ్రవాద శిక్షణా కేంద్రాలుగా మదర్సాలున్నాయని.. వాళ్లకు ఇంకా కంప్యూటర్లు, ఇతర ఆర్థిక సాయం చేస్తుండటం సిగ్గు చేటని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి రాగానే అధికారిక భాషగా ఉన్న ఊర్దును శాశ్వతంగా రద్దు చేస్తామన్నారు. అలాగే మదర్సాలను శాశ్వతంగా నిషేధిస్తామని చెప్పారు. ట్రిపుల్ తలాక్ వల్ల ఇబ్బంది పడుతున్న పేద మహిళలకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు.