ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో గొడవ చేస్తుండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అడ్డుకున్నారు. వానాకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. ధాన్యం కొనే దిక్కులేక వరి కుప్పలపై పడి రైతులు ప్రాణాలు వదులుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. టీఆర్ఎస్ ఎంపీలకు దీటుగా బండి సంజయ్ నినాదాలు చేస్తూ ఆ పార్టీ సభ్యుల తీరును ఎండగట్టారు. సంజయ్ తోపాటు బీజేపీ ఎంపీ సోయం బాబూరావు సభలో లేచి నిలబడి టీఆర్ఎస్ ఎంపీల నినాదాలకు ప్రతి నినాదాలు చేశారు.
‘‘ఎందుకీ డ్రామాలు? యాసంగి పంట కొనబోమని మీకెవరు చెప్పారు? రా రైస్ పక్కాగా కొంటాం. ఇదే మాట కేంద్రం చెబుతున్నా డ్రామాలెందుకు? వానాకాలం పంట ఎందుకు కొనడం లేదని అడుగుతుంటే యాసంగి పేరుతో ఈ నాటకాలేంటి? కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లో ధాన్యం వానకు తడుస్తూ మొలకలెత్తున్నా ఎందుకు కొనడం లేదు. వరి కుప్పలపై రైతుల చస్తున్నామీ కళ్లకు కనబడడం లేదా? ఇంకెంత మంది రైతులను చంపుతారు?’’ అంటూ మండిపడ్డారు.
వానా కాలం పంటకు సంబంధించి ప్రతి గింజను కొంటామని కేంద్రమంత్రి చెబుతున్నా రైతుల నుండి ఎందుకు సేకరించడం లేదన్నారు బండి. యాసంగిలోనూ రా రైస్ కొంటామని కేంద్రం ప్రకటించినా ఇంకా ఈ రాజకీయం చేయడమేంటని ప్రశ్నించారు. సమస్యను పక్కదారి పట్టించేందుకే టీఆర్ఎస్ ఎంపీలు డ్రామా చేస్తున్నారని విమర్శించారు. బుధవారం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లోని క్యాంటిన్ దగ్గర ప్లకార్డులతో నిరసన తెలిపిన ఫొటోలను పార్లమెంట్ లో నిరసన చేసినట్లుగా ప్రచారం చేసుకోవడంపై మండిపడ్డారు బండి సంజయ్.