తాను భయంకరమైన హిందువుగా చెప్పుకునే కేసీఆర్.. ముందుగా నాస్తికుడైన కేటీఆర్ లో మార్పు తీసుకురావాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ముఖ్యమంత్రి స్వార్థంతో యాగాలు చేస్తున్నారని.. కేబినెట్ లోని మంత్రులందరూ నాస్తికులేనని విమర్శించారు. అందుకే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా రాష్ట్రంలో చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా నాంపల్లి బీజేపీ ఆఫీస్ లో నివాళులు అర్పించారు బండి. ఈ సందర్భంగా వాజ్ పేయి సేవలను గుర్తుచేస్తూ.. తెలంగాణ సర్కార్ పై విమర్శలు చేశారు.
దుర్గమ్మ, సీతారాములను అవమానించిన స్టాండ్ అప్ కమెడియన్ మునావర్ ఫారుఖీని కేటీఆర్ రాష్ట్రానికి ఆహ్వానించడం దారుణమన్నారు బండి సంజయ్. అతడికి తెలంగాణలో అడుగు పెట్టే అర్హత లేదని చెప్పారు. యువ మోర్చా నేతలు మునావర్ లాంటి మూర్ఖుడుని రాష్ట్రంలో అడుగు పెట్టకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇక వాజ్ పేయి గురించి మాట్లాడుతూ… ఆయన స్పూర్తితో శక్తివంతమైన తెలంగాణను నిర్మించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క బీజేపీ కార్యకర్తపైనా ఉందని తెలిపారు.
కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన దేశ ప్రజలకు సుపరిపాలన అంటే ఏంటో చూపించిన మహానేత వాజ్ పేయి అని కొనియాడారు సంజయ్. పార్టీ జెండానే నమ్ముకుని 60 ఏళ్ల రాజకీయ జీవితాన్ని గడిపిన ఆదర్శమూర్తి అంటూ ప్రశంసించారు. అణు పరీక్షలు నిర్వహించి భారత్ సత్తా చాటారని.. కార్గిల్ యుద్దంలో విజయం సాధించి పాకిస్తాన్ ను దోషిగా నిలబెట్టారని వివరించారు బండి సంజయ్.