– డ్రగ్స్ కేసులో ప్రమేయమున్న వారిని అరెస్ట్ చేసే దమ్ముందా?
– మీ కుటుంబ సభ్యులతో సహా టీఆర్ఎస్ నేతల పేర్లు వెల్లడిస్తా..
– ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే తిడతారా?
– త్వరలోనే కేసీఆర్ కు పాతబస్తీ ఫైల్స్ చూపిస్తాం..!
ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ మత్తులో ఉంచుతున్నారని ఫైరయ్యారు. పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో షాద్ నగర్ లో ‘ప్రైమ్ మినిస్టర్ కప్-2022’ క్రికెట్ టోర్నమెంట్ కార్యకమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బండి.. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ సందర్భంగా సీఎంకు సవాల్ విసిరారు. ‘‘మీ కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటున్నారో పేర్లు వెల్లడిస్తా.. వారందరినీ అరెస్ట్ చేసి డ్రగ్స్ టెస్ట్ చేసే దమ్ముందా?’’ అని కేసీఆర్ కు సవాల్ చేశారు.
డ్రగ్స్ కేసులో బీజేపీ నేతల ప్రమేయం ఉంటే వాళ్లను విచారించి అరెస్ట్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు బండి సంజయ్. డ్రగ్స్ తీసుకుని, ప్రోత్సహించే నాయకులను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదన్నారు. కేసీఆర్ కు మందు తాగడం, పత్తాలడటం తప్ప క్రికెట్ ఆంటే అసలు ఇష్టమే ఉండదని చెప్పారు. పొరపాటున టీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే రాష్ట్రంలో అందరికీ మందు తాగించి, పత్తాలడిపించడమే పనిగా పెట్టుకుంటారని సెటైర్లు వేశారు.
జనమంతా మత్తులో ఊగుతూ చస్తుంటే కేసీఆర్ వినోదం చూస్తారని అన్నారు బండి. తాగి బండి నడపడం తప్పని పోలీసులు కేసులు పెడుతున్నారు కదా.. మరి తాగి రాష్ట్రాన్ని నడుపుతున్న కేసీఆర్ ను ఏమనాలని ప్రశ్నించారు సంజయ్. కేంద్రంలోని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని… ‘ఖేలో భారత్’ పేరిట క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని తెలిపారు. గతంలో ఒలింపిక్స్ జరిగితే రజతం, కాంస్య పతకాలు రావడమే భారత్ కు గగనమన్న ఆయన.. మోడీ ప్రధాని అయ్యాక ఏకంగా మూడు బంగారు పతకాలతోపాటు పెద్ద సంఖ్యలో రజత, కాంస్య పతకాలు సాధించడం దేశానికే గర్వకారణమని తెలిపారు.
దేశంలో మారుమూల ప్రాంతంలోనైనా సరే క్రీడాకారులను గుర్తించి వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖేలో భారత్ పేరిట అనేక కార్యక్రమాలు చేస్తోందని వివరించారు బండి. మోడీ రోజుకు 18 గంటలు కష్టపడితే కేసీఆర్ 18 గంటలు తాగి ఊగడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. పాకిస్తాన్ తీవ్రవాదులు కాశ్మీర్ లో ఎంతటి నరమేధం చేశారో కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారని… ఆ సినిమాను మీరు అందరూ చూడాలని పిలుపునిచ్చారు. త్వరలోనే కేసీఆర్ కు పాతబస్తీ ఫైల్స్ సినిమా చూపిస్తామని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ పాలనను గాలికొదిలేశారని… ఫాంహౌజ్ కే పరిమితమయ్యారని మండిపడ్డారు. ఆయన కొడుకేమో సీఎం సీటు కోసం డాడీ డాడీ అంటే… అది తప్పించుకోవడానికి ప్యాడీ ప్యాడీ అని గోల పెడుతూ తిరుగుతున్నారని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని తాము అడుగుతుంటే టీఆర్ఎస్ నేతలు తిడుతున్నారని.. ధాన్యం కొనమని అడిగితే పట్టించుకోవడం లేదని.. కేసీఆర్ కు దమ్ముంటే డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉన్నవాళ్లను అరెస్ట్ చేసి టెస్ట్ చేయాలన్నారు.