సీఎం కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గిరిజన రిజర్వేషన్లను ముస్లిం రిజర్వేషన్లతో ముడిపెట్టి వాటిని అమలు కాకుండా కేసీఆర్ కుట్ర చేశారన్నారు. తండాలకు నిధులు ఇవ్వకుండా ఆదివాసీ ప్రాంతాల అభివృద్దిని సీఎం అడ్డుకున్నారంటూ మండిపడ్డారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశం గర్వపడేలా నాగోబా జాతరను ఘనంగా నిర్వహిస్తామన్నారు. అర్హులందరికీ నాణ్యమైన విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తామన్నారు. నిలువ నీడలేని వారందరికీ ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. రైతులకు పంట నష్టపరిహారం అందిస్తామన్నారు.
సీఎం కేసీఆర్‌కు ఇదే చివరి అవకాశమన్నారు. ఇచ్చిన హామీలన్నింటికీ బడ్జెట్‌లో నిధులు కేటాయించండని సూచించారు. అసెంబ్లీ వేదికగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజనులంటే సీఎం కేసీఆర్‌కు చులకన అని అన్నారు.
ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి కాకుండా అడ్డుకునేందుకు కుట్ర చేశారన్నారు. పోడుభూములకు పట్టాలిస్తానని కేసీఆర్ మాట తప్పారన్నారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండాతో కలిసి ఆయన నాగోబా జాతరకు వచ్చారు. ఈ సందర్భంగా అర్జున్ ముండా, బండి సంజయ్ లకు గౌరవ వందనం చేసి వారిని అధికారులు స్వాగతించారు. మెస్రం వంశం పక్షాన బండి సంజయ్‌కు, అర్జున్ ముండాకు ఆదివాసీలు స్వాగతం పలికారు.