– టీఆర్ఎస్ కు వీఆర్ఎస్ పక్కా
– బీజేపీతో టీఆర్ఎస్ కు పోటీ ఏంటి?
– మాది దేశంలోనే అతిపెద్ద పార్టీ
– కేసీఆర్ పై బండి ఫైర్
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతోంది. అటు టీఆర్ఎస్ నేతలు కేంద్రాన్ని బద్నాం చేయాలని చూస్తుంటే.. ఇటు బీజేపీ శ్రేణులు కేసీఆర్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ తో తమకు పోటీయే కాదన్నారు. టీఆర్ఎస్ కు ఇక వీఆర్ఎస్ తప్పదని హెచ్చరించారు.
బీజేపీతో టీఆర్ఎస్ కు పోటీ ఎంటని ప్రశ్నించారు బండి. తమకు గోటితో సమానమని.. బీజేపీ దేశంలోనే అతి పెద్ద పార్టీ అని గుర్తు చేశారు. ప్రపంచంలో అత్యధికంగా కార్యకర్తలు ఉన్న పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. అలాంటిది టీఆర్ఎస్.. తమకు పోటీనా అంటూ సెటైర్లు వేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భయపడే బీజేపీ కార్పొరేటర్లను టీఆర్‌ఎస్ చేర్చుకుందని ఆరోపించారు.
డబ్బు ప్రలోభాలు, కేసుల భయం పెట్టి కార్పొరేటర్లను టీఆర్‌ఎస్ చేర్చుకుందని మండిపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికలను గల్లీ స్థాయికి దిగజార్చారని కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ తమ ఫ్లెక్సీలను అడ్డుకున్నంత మాత్రాన మమ్మల్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. ఒక పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రోటో కాల్ పాటించాలని కూడా తెలియదా? అంటూ మండిపడ్డారు.
తెలంగాణలో టీఆర్ఎస్ పాలన అధ్వానంగా మారిందని విమర్శించారు బండి. అన్నింటి ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. కరెంట్, నల్లా, బస్, రిజిస్ట్రేషన్ ఛార్జీల మోత మోగిస్తున్నారని ఫైరయ్యారు. త్వరలో ప్రజలు టీఆర్ఎస్, బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ పలకడం ఖాయమని జోస్యం చెప్పారు.