– టీఆర్ఎస్ ఆఫీస్ కు రూ.150 కోట్ల భూమా?
– ఇదెక్కడి న్యాయం?
– ఆ డబ్బుతో పేదలకు ఇళ్లు కట్టొచ్చు..
– పెన్షన్లు ఇవ్వొచ్చు..
– కేంద్రం డబ్బులు పంపుతున్నా..
– ఉపాధి కూలీలకు కేసీఆర్ ఇవ్వడం లేదు
– పైసలివ్వకపోతే క్రిమినల్ కేసు పెట్టండి
– కూలీలకు బండి పిలుపు
రాష్ట్రంలో పేదలకు ఇండ్లు ఇవ్వడం చేతగాని ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం బంజారాహిల్స్ లో రూ.150 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని అప్పనంగా తీసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మండిపడ్డారు. ఆ డబ్బుతో వేలాది మందికి ఇండ్లు నిర్మించవచ్చని, పెన్షన్లు అందజేయవచ్చని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పనులకు సంబంధించిన నిధులను కేంద్ర ప్రభుత్వం టైమ్ కే చెల్లిస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం మాత్రం కూలీలకు సక్రమంగా చెల్లించకుండా వేధిస్తోందని మండిపడ్డారు. ఇకపై సక్రమంగా ఉపాధి డబ్బులు ఇవ్వకుంటే బాధ్యులపై క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపాలని పిలుపునిచ్చారు.
29వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలోని పులిమామిడిలో గ్రామస్తులతో కలిసి రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరవు పెట్టారు. “బస్ చార్జీలు, కరెంట్ చార్జీలు, పెట్రోల్, ఉప్పు, పప్పు, నూనెల ధరలతో పాటు, చివరకు తాగడానికి నీళ్లు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. అర గుంట పొలం ఉన్నోడికి ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. మరి ఆ పొలం కూడా లేనోళ్ళ పరిస్థితి ఏంది? పెన్షన్లు రావడం లేదు… ఇళ్ళు లేవు. 11 ఏళ్లుగా ఇళ్ళు లేక నరకయాతన అనుభవిస్తున్నాం. గుంట భూమి లేదు, ఉండడానికి ఇళ్ళు లేదు. మేమెట్లా బతకాలి? మమ్మల్ని మీరే ఆదుకోవాలి సారూ” అంటూ వాపోయారు. వారి బాధలన్నీ విన్న బండి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
కేసీఆర్ ఏడేళ్లుగా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు బండి. ఆయన అబద్దాలు చూశాక.. ఇతర రాజకీయ నాయకులు నిజాలు చెబుతున్నా ప్రజలు నమ్మడం లేదని సెటైర్లు వేశారు. “జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న వారందరికీ ఎప్పటికప్పుడు కేంద్రం నిధులు చెల్లిస్తోంది. ఎండాకాలంలో ఒక్కొక్కరికి రూ.277లను అందజేస్తోంది. కేసీఆర్ మాత్రం సకాలంలో డబ్బులివ్వకుండా పేదలను మోసం చేస్తున్నడు. ఇకపై వారం వారం ఉపాధి హామీ పైసలు ఇవ్వకపోతే క్రిమినల్ కేసు పెట్టండి. జైలుకు పంపండి. ఆ పైసలు కేంద్రం ఇస్తోందే తప్ప కేసీఆర్ అయ్య జాగీరు కాదు. తెలంగాణలోని పేదలకు 1.4 లక్షల ఇండ్లను కేంద్రం మంజూరు చేస్తే… వాటిని నిర్మించకుండా కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నడు. హైదరాబాద్ లో 150 కోట్ల విలువైన 4,935 గజాల స్థలాన్ని టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కట్టడానికి తీసుకున్నడు. ఆ డబ్బులతో ఇక్కడున్న పేదోళ్లకు ఫించన్లు, ఇండ్లు ఇవ్వొచ్చు” అని చెప్పారు బండి సంజయ్.
పేదలకు రెండు డోసుల ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోడీదేనన్న ఆయన… పేదలకు 5 కిలోల బియ్యాన్ని ఫ్రీగా ఇస్తున్నట్లు తెలిపారు. కిలో బియ్యానికి 29 రూపాయలు భరిస్తున్న మోడీ గొప్పోడా? ఒక రూపాయి భరిస్తున్న కేసీఆర్ గొప్పోడా? అని అడిగారు. ఓట్ల కోసమో… ఎన్నికల కోసమో తాను రాలేదని.. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకే వచ్చానని చెప్పారు. మోడీ ఆదేశాలతో 29 రోజులుగా పాదయాత్ర చేస్తున్నానన్నారు. పైసలు ఉన్నవాడికే రైతుబంధు ఇస్తున్నారన్న బండి.. పైసలు లేనివాళ్ళకి రైతు బంధు, రైతు బీమా ఇవ్వడం లేదని విమర్శించారు.
వరి వేస్తే ఉరే అన్న కేసీఆర్… తన ఫాంహౌస్ లో మాత్రం ఎందుకు పండించారని ప్రశ్నించారు. కేసీఆర్ మాటలు విని, నష్టపోయిన వాళ్లకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. “కేంద్రం ఇచ్చే నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది. గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధుల నుంచే… విద్యుత్ బిల్లులను చెల్లించుకుంటున్నారు. కేసీఆర్ సర్కార్ రూ.60 వేల కోట్లను డిస్కమ్ లకు చెల్లించాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలని, రైతులను ఆదుకోవాలని కొట్లాడితే మమ్మల్ని కొట్టిస్తూ జైళ్లకు పంపిస్తున్నారు. రైతుల కోసం కొట్లాడేందుకు వెళితే నాపై కూడా రాళ్ళ దాడి చేయించారు. మమ్మల్ని ఏం చేసినా భయపడే ప్రసక్తే లేదు. ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వడం గద్దెనెక్కిన తర్వాత విస్మరించడం కేసీఆర్ కు తెలిసిన విద్య. తెలంగాణలో పేదోళ్ల రాజ్యం వస్తేనే… ప్రజలకు న్యాయం జరుగుతుంది. 1400 మంది పేదోళ్లు చనిపోతేనే తెలంగాణ వచ్చింది. పేదోళ్ల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో పెద్దోళ్లు రాజ్యమేలుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ప్రతి ఒక్కరిపై లక్ష అప్పు ఉంచి, చిప్ప చేతికి ఇచ్చిండు. మీకు సేవ చేసే అవకాశం మాకు ఇవ్వండి” అని ప్రజలను కోరారు బండి.