రాష్ట్రంలో ప్రతీ గింజ కొంటామని ఇటీవల సీఎం కేసీఆర్ ఆర్భాటంగా ప్రకటించారని.. కానీ.. 15 రోజులు కావొస్తున్నా సరైన చర్యలు తీసుకోలేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనిస్తే కేసీఆర్ ప్రకటన కేవలం ఉత్తర కుమారుని ప్రగల్భాలేనని స్పష్టం అవుతోందని అన్నారు. ఇప్పటికైనా కళ్లకు కట్టుకున్న గంతలు తీసేసి క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్న తనకు అనేక మంది రైతులు వచ్చి కొనుగోళ్ళ కేంద్రాలు ప్రారంభించలేదని చెబుతున్నారని అన్నారు బండి. గద్వాలలో 71 కొనుగోళ్ల కేంద్రాలు ఓపెన్ చేయాల్సి వుండగా కేవలం రెండు మాత్రమే ప్రారంభించారని తెలిపారు. అదేవిధంగా వనపర్తిలో 225 కేంద్రాలకు 19, నారాయణపేటలో 91 కేంద్రాలకు 70 మాత్రమే తెరిచారని చెప్పారు. అలాగే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కాంటా పెడుతున్నది నామమాత్రమేనని లేఖలో వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా 7 వేల కేంద్రాలు ప్రారంభించాల్సి వుండగా కేవలం 2,500 మాత్రమే ప్రారంభించారు అన్నారు బండి. ప్రభుత్వం 60 లక్షల టన్నుల ధాన్యం కొనాల్సి వుండగా కేవలం 2 లక్షలు మాత్రమే ఇప్పటివరకు కొనుగోలు చేసిందని చెప్పారు. దీన్ని బట్టే రైతుల సంక్షేమం పట్ల కేసీఆర్ కు ఎంత శ్రద్ధ, చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, ప్రతీ కొనుగోలు కేంద్రంలో కాంటా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సర్కార్ త్వరగా స్పందించకపోతే రైతాంగం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని తెలిపారు. రైతులు వడ్లను తీసుకొని కొనుగోలు కేంద్రాలకు వస్తున్నా.. వాటిని తీసుకోకపోవడం వల్ల వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు.
రైతులకు అవసరమైనంత గోనె సంచులను సేకరించాలని, సేకరించిన వడ్లకు వెంటనే చెల్లింపులు చేయాలని, అకాల వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనాలని డిమాండ్ చేశారు సంజయ్. ధాన్యం కొనుగోలుకయ్యే ప్రతి పైసా ఖర్చును కేంద్రప్రభుత్వమే చెల్లిస్తున్నందున ప్రభుత్వం ఎటువంటి అలసత్వాన్ని చూపించకుండా పనులను యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. అలాగే సేకరించిన వడ్లను బియ్యంగా మార్చి కేంద్రప్రభుత్వానికి ఇస్తే పూర్తిగా తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ గింజ కొనేవరకు, రైతులకు చెల్లించాల్సిన సొమ్ములను చెల్లించే వరకు బీజేపీ పోరాటం సాగిస్తుందని లేఖలో పేర్కొన్నారు బండి సంజయ్.