తెలంగాణలో బీసీ బంధు పథకాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీసీల సమస్యలను గుర్తు చేస్తూ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారాయన. అర్హులైన ప్రతీ ఒక్క బీసీ కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందించాలన్నారు. జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల సంక్షేమం కోసం బీసీ బంధు పథకం ప్రారంభించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలపై సవతి తల్లి ప్రేమ విడనాడాలని లేఖలో పేర్కొన్నారు బండి. బీసీ సబ్ ప్లాన్ ను అటకెక్కించారని విమర్శించారు. వెంటనే బీసీ సబ్ ప్లాన్ ను ప్రవేశపెట్టి దానికి చట్ట భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. 46 బీసీ కులాలకు నిర్మిస్తామని చెప్పిన ఆత్మ గౌరవ భవనాలు ఎక్కడ అని ప్రశ్నించారు. రూ.3,400 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు.
చేనేత కార్మికులకు బీమా, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని.. గీత కార్మికులను ఆదుకోవడాని వెంటనే గీత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. మోపెడు బండ్లు ఉచితంగా ఇవ్వాలని, ప్రమాదవశాత్తు గాయపడిన గీత కార్మికులకు రూ.4 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే దోబీఘాట్ల నిర్మాణాలు ప్రారంభించాలని, రజకులకు డ్రైయింగ్ మెషిన్లు ఇవ్వాలని, ఇప్పటిదాకా వారికిచ్చిన హామీలు నెరవేర్చాలని గుర్తు చేశారు. నాయీ బ్రాహ్మణులకు 200 యూనిట్ల కరెంట్ ను ఫ్రీగా ఇవ్వాలని, మోడ్రన్ సెలూన్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించాలన్నారు బండి.
ఇక గొర్రెల పంపిణీ ఎప్పుడు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డీడీలు కట్టిన 4 లక్షల మంది గొర్రెల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఎంబీసీ కార్పొరేషన్ కు సమృద్ధిగా నిధులు కేటాయించాలన్నారు. రాష్ట్ర కేబినెట్ లో 8 మంది బీసీలకు చోటు కల్పించాలని.. ప్రధాని మోడీ కేంద్ర కేబినెట్ లో 27 మంది బీసీలకు స్థానం కల్పించి గౌరవించారని గుర్తు చేశారు. జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా ఇచ్చిన ఘనత ప్రధాని మోడీకి, బీజేపీ పార్టీదేనన్నారు బండి సంజయ్.