– పాలమూరులో వలసలు లేవా?
– ఏం మాట్లాడుతున్నావ్ కేసీఆర్
– వలసలు లేవని నిరూపిస్తే..
– రాజకీయాల నుంచి తప్పుకుంటా?
– నా సవాల్ ను స్వీకరించే దమ్ముందా?
– కేసీఆర్ కు బండి ఛాలెంజ్
పాలమూరు జిల్లా పరిస్థితి చూస్తుంటే ఎంతో బాధగా ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా దేవరకద్రలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆర్డీఎస్ ను ఆధునికీకరిస్తామన్న హామీని కేసీఆర్ విస్మరించారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఆర్డీఎస్ ను ఆధునికీకరిస్తామని హామీ ఇచ్చారు. సీఎంకు సంపాదనే ముఖ్యం తప్ప.. రాష్ట్ర సంక్షేమం అవసరం లేదని విమర్శించారు. దేవరకద్ర ప్రాంతంలో రాజ్యమేలుతోన్న టీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
‘‘పాలమూరు నుంచి వలసలు లేవని కేసీఆర్ మాట్లాడారు. పాలమూరులో వలసలు లేవని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. వలసలు ఉన్నాయని నిరూపించడానికి నేను సిద్ధం. నా సవాలును స్వీకరించేందుకు కేసీఆర్ సిద్ధమా?దత్తత తీసుకున్న పాలమూరుకు కేసీఆర్ 8 ఏళ్లలో ఏం చేశారు?’’ అని బండి సంజయ్ ప్రశ్నించారు. చెక్ డ్యామ్ ల పేరుతో ఒకడు రూ.120 కోట్లు, ఇసుక పేరుతో ఇంకొకడు రూ.100 కోట్లు సంపాదించారని ఆరోపించారు. కేసీఆర్ పేరు చెబితే కాంట్రాక్టర్లు భయపడుతున్నారని సెటైర్లు వేశారు. కేసీఆర్ కుటుంబంలో ఐదుగురికి ఉద్యోగాలొచ్చాయని.. నిరుద్యోగులకు మాత్రం రాలేదన్నారు. ఉపాధిహామీ పథకం కింద చెల్లించాల్సిన సొమ్మును కేసీఆర్ చెల్లించడం లేదని విమర్శించారు. కేంద్రం డబ్బులు ఇస్తున్నా కేసీఆర్ ఎందుకు కూలీలకు చెల్లించడం లేదో సమాధానం చెప్పాలన్నారు.
దేవరకద్రలో టాయిలెట్స్ నిర్మాణం, రైతు వేదికలకు, పల్లెప్రకృతి వనం.. ఇలా వివిధ పథకాల కింద కేంద్రం నిధులు ఇస్తోందని చెప్పారు సంజయ్. కేసీఆర్ కు లెక్కలు అప్పచెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. ఎక్కడికి రమ్మంటారో చెప్పాలన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని.. కలిసే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయని ఆరోపించారు. ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేదని.. ఇప్పటికే 60 శాతం మంది రైతులు నష్టానికే ధాన్యం అమ్ముకున్నారన్నారు. రైతులను టీఆర్ఎస్ ప్రభుత్వం హరిగోస పెడుతోందని మండిపడ్డారు. దొంగ దీక్షచేసి, తెలంగాణ సమాజాన్ని నమ్మించి మోసం చేశారని కేసీఆర్ పై ఫైరయ్యారు. మళ్ళీ సెంటిమెంట్ రగిలించి పబ్బం గడపాలని చూస్తున్నారని.. వేలకోట్ల నిధులు తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం కేటాయిస్తున్నా.. రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ సహకరించడం లేదని ఆరోపించారు.
కేంద్రాన్ని బద్నాం చేయడానికే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారే తప్ప.. అభివృద్ధి గురించి ఆలోచించడం లేదన్నారు బండి. రాజకీయాలు తర్వాత మాట్లాడుదాం.. తెలంగాణ అభివృద్ధి కోసం ముందు మాట్లాడుదాం అని మోడీ పిలిచినా ఇప్పటివరకు కేసీఆర్ వెళ్లలేదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతం చెల్లించే పరిస్థితి లేదన్న సంజయ్.. ప్రతీ ఒక్కరిపై లక్షపైగా అప్పు ఉందన్నారు. అప్పులు చేసి కేసీఆర్ చిప్ప చేతికి ఇస్తున్నారని విమర్శించారు. ఏ సర్వే చూసినా వచ్చేది బీజేపీనే అనే వచ్చాయని.. అప్పటి నుంచి సీఎంకు భయం పట్టుకుందన్నారు. కేసీఆర్ కు తెలంగాణను పాలించే అర్హత లేదని.. వేలకోట్ల రూపాయలను దండుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్.