టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగే అవినీతి బయటకు రాకుండా ఉండాలనే లక్ష్యంతోనే కేసీఆర్ రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రభుత్వ అవినీతిపై చర్చను దారి మళ్లించేందుకు కేసీఆర్ ఈ ప్లాన్ వేశారని ఆరోపించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ పై విమర్శలు చేశారు.
ఏ రాజ్యాంగం మీద ఒట్టు వేసి సీఎంగా ప్రమాణం చేశారో.. దాని ద్వారా మరో వ్యక్తి సీఎం కాకూడదని కేసీఆర్ భావిస్తున్నారని విమర్శించారు సంజయ్. అందుకే రాజ్యాంగాన్ని తిరగరాయాలంటున్నారని మండిపడ్డారు. దీనిపై చట్ట, న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు లాయర్లు పోరాడాలని సూచించారు.
రాజ్యాంగంపై నమ్మకం లేనప్పుడు సీఎం పీఠంపై కూర్చునే అర్హత కేసీఆర్ కు లేదన్నారు బండి. కల్వకుంట్ల రాజ్యాంగం వస్తే తన కుటుంబమే రాజ్యమేలుతుందని నమ్మకంలో సీఎం ఉన్నట్లు కనిపిస్తోందని చెప్పారు. అసలు.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎందుకు నచ్చలేదని ప్రశ్నించారు. దానికి సంబంధించిన కారణాలు చెప్తే.. ప్రజలకు మేలు చేసేవిగా ఉంటే తాము కూడా సహకరిస్తామని తెలిపారు.
ఇటు మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ పై దేశద్రోహం కేసు పెడతామన్నారు. రాజ్యాంగంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై న్యాయ పోరాటం చేస్తామని.. ప్రతీ కోర్టు ముందు దీక్షలు చేస్తామని చెప్పారు. బీజేపీ కార్యకర్తల మీద పోలీసులు తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారన్న ఆయన.. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు.