– పోరుకు సిద్ధం కండి.. విజయం మనదే!
– ఏ క్షణంలో అయినా ఎన్నికలు రావచ్చు
– అన్ని జిల్లాల అధ్యక్షులతో సమావేశం
– పార్టీ శ్రేణులకు బండి పిలుపు
ప్రజలు టీఆర్ఎస్ పాలనపట్ల తీవ్ర వ్యతిరేకతతో.. బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నారని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ వాతావరణాన్ని పూర్తి స్థాయిలో పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని.. అందుకోసం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా స్థానిక సమస్యలను గుర్తించి తక్షణమే ఉద్యమించాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజల్లో బీజేపీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక టీఆర్ఎస్ నేతలు రాబోయే రోజుల్లో మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉందన్నారు. భయపెట్టేందుకు బీజేపీ కార్యకర్తలపై కేసులు కూడా నమోదు చేయొచ్చని వ్యాఖ్యానించారు. బీజేపీకి అధికారం ఇప్పుడు రాకుంటే.. ఇక వచ్చే అవకాశం లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. అన్నింటికీ సిద్ధం కావాలని.. పార్టీ బలోపేతానికి తెగించి కొట్లాడాలని పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జిల్లా అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బండి సంజయ్ తోపాటు 25 జిల్లాల అధ్యక్షులు హాజరయ్యారు. పార్టీ సంస్థాగత బలోపేతం, జిల్లాల్లో పరిస్థితితోపాటు.. ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యాచరణపై దాదాపు రెండున్నర గంటలపాటు చర్చించారు.
రాష్ట్రంలో రాజకీయ వాతావరణం చూస్తుంటే ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందన్నారు సంజయ్. అందుకు తగ్గట్టుగానే క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఇప్పటి వరకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోనే ఎక్కువగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు నిర్వహించామని.. ఇకపై స్థానిక సమస్యలే ఎజెండాగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.
పోలింగ్ బూత్ స్థాయి మొదలు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తను ఈ ఆందోళనలలో భాగస్వాములను చేయాలని సూచించారు. రాష్ట్రంలో ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని.. అదే సమయంలో టీఆర్ఎస్ పాలనపట్ల తీవ్ర కోపంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇది భరించలేని టీఆర్ఎస్ నేతలు అక్కసుతో బీజేపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. సిరిసిల్ల జిల్లాలో 25 మంది కార్యకర్తలపై అకారణంగా దాడి చేసి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయించారని విమర్శించారు. రాబోయే రోజుల్లో ఈ దాడులు, బెదిరింపులు, కేసులు మరిన్ని ఎక్కవవుతాయని.. అన్నింటికీ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ సహా 4 రాష్ట్రాల్లో పార్టీ జిల్లా అధ్యక్షులు కష్టపడి పనిచేయడంవల్లే.. మళ్లీ అక్కడ అధికారంలోకి వచ్చామని.. అదే స్పూర్తితో పని చేయాలని సూచించారు.
Advertisements
యూపీలో కష్టపడి పనిచేసిన జిల్లా అధ్యక్షులకు ఎమ్మెల్సీ సహా అనేక నామినేటెడ్ పదవులిచ్చి గౌరవించినట్లు గుర్తుచేశారు. కష్టపడి పనిచేసి పార్టీ గెలుపునకు దోహదపడిన వారికి తగిన గౌరవం ఉంటుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని అన్నారు. స్థానిక ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై పోరాడేలా కార్యాచరణ రూపొందించి ఆందోళనలు నిర్వహించాలని వివరించారు బండి. టీఆర్ఎస్ పాలనపై చర్చ జరగకుండా దారి మళ్లించేందుకు కేసీఆర్ ఉద్యోగాల భర్తీ, ధాన్యం కొనుగోలు పేరుతో రోజుకో డ్రామా చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ట్రాప్ లో పడకుండా ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ డ్రామాలను ప్రజల్లో ఎండగట్టాలని జిల్లా అధ్యక్షులకు సూచించారు సంజయ్.