ఓవైపు కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం అంటూ సీఎం కేసీఆర్ పావులు కదుపుతుండగా.. రాష్ట్ర బీజేపీ ఆయనకు షాకిచ్చింది. కేంద్రం కొనుగోళ్లకు సంబంధించి ఢిల్లీలో రాజకీయం నడుపుదామని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తుండగా.. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ను కలిశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
వీరి మధ్య యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి చర్చ జరిగింది. యాసంగిలో కూడా తెలంగాణ నుండి రా రైస్ కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు పీయూష్ గోయల్. రైతులను ఆదుకోవడం తమ కనీస బాధ్యతని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ విషయంలో కేంద్రానికి సహకరించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు.
ఈ భేటీలో బండితోపాటు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా పాల్గొన్నారు. కేంద్రం యాసంగి ధాన్యం కొనకుండా తెలంగాణకు అన్యాయం చేస్తోందంటూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని పీయూష్ గోయల్ కు వివరించారు. దానిపై స్పందించిన పీయూష్.. “అసలు రా రైస్ కొనబోమని చెప్పిందెవరు..? దేశవ్యాప్తంగా బియ్యం ప్రొక్యూర్ చేస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు ఆపుతామో చెప్పాలి” అని అన్నారు. పక్కా రా రైస్ కొంటామని.. అసలు గతంలో ఇస్తానన్న బియ్యన్నే తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదని చెప్పారు.
Advertisements
దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తుందో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలన్నారు పీయూష్ గోయల్. పార్లమెంట్ సాక్షిగా గతంలోనే టీఆర్‌ఎస్ లేవనెత్తిన అంశాలన్నింటికీ సమాధానం ఇచ్చామని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ పంపబోమని రాష్ట్ర ప్రభుత్వమే సంతకం చేసింది కదా.. ఇప్పుడొచ్చిన ఇబ్బందేంటో స్పష్టం చేయాలన్నారు పీయూష్ గోయల్.