– నిత్యం ప్రజల్లోనే ఉండండి..
– కష్టపడి పనిచేసేవాళ్లకే అవకాశాలు
– టికెట్ల కేటాయింపు.. జాతీయ నాయకత్వానిదే!
– లాబీయింగ్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు!
– వ్యక్తి పూజ వద్దు.. పార్టీనే ముఖ్యం
– కలిసికట్టుగా పోరాడదాం.. అధికారం సాధిద్దాం!
– కామారెడ్డి జిల్లా నేతలతో బండి సంజయ్
అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక, టిక్కెట్ల కేటాయింపు అంతా బీజేపీ జాతీయ నాయకత్వం, పార్లమెంటరీ బోర్డు చూసుకుంటుందన్నారు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. టిక్కెట్ల కోసం లాబీయింగ్ చేసి సమయాన్ని వృధా చేసుకోవద్దని..కష్టపడి పనిచేస్తూ పార్టీ విధానాలకు లోబడి క్రమశిక్షణతో మెలిగే వారికే దక్కుతాయని స్పష్టం చేశారు. ఖానాపూర్ లో ప్రజా సంగ్రామ యాత్ర శిబిరం దగ్గర కామారెడ్డి జిల్లా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు బండి. అందరూ నిరంతరం ప్రజల్లోనే ఉండాలని.. స్థానిక సమస్యలపై పోరాటాలు చేస్తూ బాధితులకు అండగా ఉండాలన్నారు. ఏ సమస్య వచ్చినా రాష్ట్ర నాయకత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
‘‘కామారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం బాగోలేదు. ప్రజలంతా బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా చూస్తున్నారు. వెంటనే స్థానిక సమస్యలపై పోరాడండి. బీజేపీ అధికారంలోకి వస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకం ప్రజలకు కల్పించండి. తక్షణమే పోలింగ్ బూత్ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలి. ఏదో ఒక సాకుతో బూత్ కమిటీల ఏర్పాటులో జాప్యం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు’’ అని హెచ్చరించారు. ఇన్నాళ్లు బీజేపీ చేసిన పోరాటాలతో ప్రజలు మనవైపే ఉన్నారన్న బండి.. కాంగ్రెస్ జీరో అయిపోయిందని విమర్శించారు. అభిప్రాయ బేధాలను పక్కనపెట్టి కష్టపడి పనిచేస్తే జిల్లాలోని ఎమ్మెల్యే స్థానాలన్నీ బీజేపీ కైవసం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పారు.
తక్షణమే స్థానిక సమస్యలను గుర్తించాలన్న సంజయ్.. ప్రజలను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలపై తీవ్రస్థాయిలో ఉద్యమించాలని పార్టీ నేతలకు సూచించారు. బీజేపీని గెలిపిస్తే సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకం ప్రజల్లో ఉంటే గెలుపు మనదే అవుతుందన్నారు. పోరాడే వాళ్లకు, సీరియస్ గా పనిచేసే వాళ్ల పక్షానే ప్రజలుంటారనే విషయాన్ని విస్మరించొద్దని.. టిక్కెట్ల సంగతి పార్టీ చూసుకుంటుందని తెలిపారు. టికెట్ల విషయంలో ఒత్తిళ్లు పనిచేయవని.. పనితీరు, ప్రజల్లో ఉన్న పలుకుబడి, చేసిన పోరాటాలను బేరీజు వేసుకుని కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. వ్యక్తి కోసం పనిచేసే వాళ్లకు పార్టీలో భవిష్యత్ లేదని.. పార్టీ కోసం పనిచేసే వాళ్లకే అవకాశాలు ఉంటాయన్నారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు బండి. కేసీఆర్ స్ట్రాటజీలెలా ఉంటాయో తనకు తెలుసని చెప్పారు. అందుకే ధీటుగా ఎదుర్కొంటూ అందరి సహకారంతో బీజేపీని టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా మార్చామని తెలిపారు. బీజేపీ అడ్డదారుల్లో అధికారంలోకి రావాలంటే ఎప్పుడో వచ్చేవాళ్లమని చెప్పారు. కానీ, సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నామని తెలిపారు. ఒక్కసారి అధికారంలోకి వస్తే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించేలా బీజేపీ పాలన కొనసాగిస్తుందని స్పష్టం చేశారు బండి సంజయ్.