కుర్చీ వేసుకుని సమస్యలు పరిష్కరిస్తానన్న హామీ ఏమైంది..?
రైతులు, గిరిజనులపై లాఠీలు ఝుళిపించి జైల్లో వేస్తావా?
ధరణి పోర్టల్‌తో కేవలం కేసీఆర్ కుటుంబానికే లాభం
కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్.
సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌తో గ్రామాల్లో చిచ్చు పెట్టారని ఆరోపించారు బిజెపి తెలంగాణ చీఫ్ బండి సంజయ్. ధరణి పోర్టల్‌తో కేసీఆర్, ఆయన కుటుంబానికి తప్ప ప్రజలెవరికీ ఉపయోగం లేదన్నారు. వేల కోట్ల రూపాయల విలువచేసే భూములను కేసీఆర్ తన పేరిట రిజిస్టర్ చేయించుకునేందుకు ధరణి పోర్టల్ తీసుకొచ్చారని విమర్శించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ధరణిని సరిదిద్దాలన్న ఆలోచన కూడా కేసీఆర్ కు లేదని ఎద్దేవా చేశారు. ఈ పోర్టల్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీఆర్ఎస్ నేతలే చెబతున్నా ఈ ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు.
టీఆర్ఎస్ పార్టీ గతంలో ఇచ్చిన హమీ మేరకు పోడు భూముల సమస్యను పరిష్కరించాలని, ధరణి పోర్టల్ తలెత్తిన లోపాలను సరిదిద్ది ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ బండి సంజయ్ కుమార్ ఈరోజు కరీంనగర్ లోని వరలక్ష్మీ గార్డెన్స్ లో ‘మౌన దీక్ష’చేపట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ వైఫల్యాలపై బండి విరుచుకుపడ్డారు. కేసీఆర్ సీఎం అయినప్పటి నుండి ఏ సమస్య చెప్పినా.. కుర్చీ వేసుకుని పరిష్కరిస్తానని మాటలు చెప్పుడు అలవాటైందని విమర్శించారు.
8 ఏళ్ల నుండి సీఎం కేసీఆర్ ఇలానే అనేక హామీలిచ్చి.. ఇంతవరకు ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని సంజయ్ ఫైరయ్యారు. కేసీఆర్ నోరు తెరిస్తే అన్ని అబద్దాలే… కరప్షన్ ను తగ్గించడానికే ధరణి పోర్టల్ తీసుకొచ్చానని చెప్పిన కేసీఆర్.. ప్రశాంతంగా ఉన్న ఉళ్లల్లో చిచ్చు పెట్టిండని ఆరోపించారు. సీఎం ఏ పని చేసినా ఆయనకు, ఆయన కుటుంబానికి మేలు చేయాలనే ఆలోచన తప్ప, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశమే లేదన్నారు. గోల్ మాల్ చేయడానికి, భూములను కబ్జా చేసుకుని దండుకోవడానికే ధరణి పోర్టల్ తీసుకొచ్చిండన్న ఆయన.. ఆ ధరణి పోర్టల్ తెచ్చాక ఎవరి భూములు ఎవరికి పోయినయో తెల్వని పరిస్థితి నెలకొందని అన్నారు. 40, 50 ఏళ్ల కింద భూములు అమ్ముకున్నవాళ్లు, వదిలేసి వెళ్లిపోయిన వాళ్లంతా ఇయాళ ఊర్లల్లోకి వచ్చి రైతుల మీద పడి భూములు లాక్కుంటున్నరని మండిపడ్డారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న రైతుల గుండె పగిలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ధరణి వల్ల చాలామంది రైతుల భూములు గల్లంతయ్యాయని సంజయ్ పేర్కొన్నారు. కబ్జాకాలం తీసేయడంతో అనేక మంది భూములు కోల్పోవాల్సి వస్తోందన్నారు. భూ సమస్యలపై అడిగేందుకు వెళితే…మా చేతిలో ఏమీలేదని అధికారులు చేతులెత్తేస్తున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రికార్డుల్లో పేర్లు గల్లంతైన రైతులు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని.., దీంతో ఎకరాలకు ఎకరాలు గల్లంతయ్యాయని మండిపడ్డారు.
టీఆర్ఎస్ నేతలే ధరణిలో ఇబ్బందులున్నాయని చెప్తున్నారంటే.. ధరణి వల్ల రైతులకు ఏం ఒరిగిందో అర్థం చేసుకోవాలన్నారు సంజయ్. వేల కోట్ల విలువైన భూములు కేసీఆర్ బంధువుల పేరిట మార్చుకున్నారన్న ఆయన.. కేసీఆర్ బండారం బయట పడుతుందనే ధరణిని కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో15 లక్షల ఎకరాల భూముల వివరాలు ఇంకా ధరణిలో నమోదు కాలేదని, వాటిలో సగం లోపాలున్నాయని, కరెక్షన్ ఆప్షన్ ఇవ్వడం లేదని, ఓటు ద్వారా నీ అధికారాన్ని ప్రజలే కరెక్షన్ చేస్తారన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.
మీడియా పట్ల గౌరవంగా మాట్లాడుతున్నారంటే బిజెపినే కారణమని సంజయ్ స్పష్టం చేశారు. పోడుభూములను నమ్ముకుని బతుకుతున్న గిరిజనులపై దండయాత్ర చేయిస్తున్నారని, ఎన్నికలొచ్చిన ప్రతిసారీ పోడు భూముల సమస్యను కుర్చీ వేసుకుని పరిష్కరిస్తానని చెప్పడం మాట తప్పడం కేసీఆర్ కు రివాజుగా మారిందన్నారు. పంటలు వేసుకోవాలని చెప్పి తీరా పంట చేతికొచ్చే సమయంలో పోలీసు, ఫారెస్టు అధికారులతో ధ్వంసం చేయిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ధరణి, పోడు సమస్యలు వెంటనే పరిష్కరించాలనే ఈమౌన దీక్ష చేపట్టామని వెల్లడించారు. పేద రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, పోడుభూములకు పట్టాలిచ్చేదాకా బిజెపి పోరాటం ఆగదని సంజయ్ స్పష్టం చేశారు.