సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ త్వరలో జైలుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయటం రాజకీయంగా సంచలనంగా మారింది.
కోతల రాయుడు ఢిల్లీ వెళ్తారని ముందే చెప్పామని, వంగి.. వంగి.. పొర్లి దండాలు పెట్టినా మేము క్షమించేది లేదన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికే కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేశారన్న ఆయన, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రజలు చావు దెబ్బ కొట్టారన్నారు. లోపల జరిగేది ఒకటైతే…. సీఎం కేసీఆర్ బయటకొచ్చి చెప్పేది ఇంకొక్కటన్నారు. వరదల సమయంలో కేసీఆర్ ఫాంహౌస్ వదిలి బయటకు రాలేదని, కాళేశ్వరం మూడో టీఎంసీ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారన్నారు. కాళేశ్వరానికి తక్కువ సమయంలో కేంద్రం అనుమతులిచ్చిందని కేసీఆరే చెప్పారని గుర్తు చేసిన బండి సంజయ్…. కాళేశ్వరం అంచనాలను అడ్డగోలుగా పెంచారని, ఇదేంటని ప్రశ్నిస్తే మా రాష్ట్రం.. మా నిధులంటున్నారన్నారు.