గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ పేరుతో పోలీసులు పేదల పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. చిన్నా పెద్దా, మహిళలనే తేడా లేకుండా దౌర్జన్యం చేసి కాళ్లు చేతులు విరగ్గొట్టడం, తలలు పగలకొట్టడం దారుణన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా నిర్వాసితులను ఆదుకోకుండా ఏళ్ల తరబడి సమస్యను నాన్చుతూ కాలయాపన చేయడం అన్యాయమన్న ఆయన… ఉన్నట్లుండి దాడులు చేయడం ఆటవికమని విమర్శించారు.
రజాకార్ల పాలనలో, బ్రిటీష్ పాలనలో కూడా ఇలాంటి అరాచకాలు చేయలేదన్న బండి.. ఇకనైనా కేసీఆర్ ఫాంహౌస్ నుండి పాలించడం మానుకోవాలని హితవు పలికారు. మహిళల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించడం దుర్మార్గమని… అసలు అర్ధరాత్రి వెళ్లి దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా ప్రభుత్వానిది ఏ తప్పూ లేకపోతే పగలు వెళ్లి బాధితులను కలిసి ఏ విధంగా ఆదుకుంటామో చెప్పాలన్నారు.
నిర్వాసితులు సహకరించడానికి సిద్ధంగా ఉన్నా వారిని ఆదుకునే సోయి మాత్రం సీఎంకు లేకపోవడం బాధాకరమని మండిపడ్డారు. ఇకనైనా సీఎం స్పందించాలన్నారు. వెంటనే ప్రాజెక్టు పనులు నిలిపేయాలని… నిర్వాసితులను పూర్తిగా ఆదుకున్న తరువాత పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని పోరాటం సాగిస్తుందని స్పష్టం చేశారు బండి సంజయ్.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు మూడు రోజుల్లో గౌరవెల్లి ప్రాజెక్ట్ ట్రయల్ రన్ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. దీన్ని అడ్డుకుంటారనే ఉద్దేశంతో ముందస్తుగా భూ నిర్వాసితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సుమారు వందమందిని అరెస్ట్ చేసి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లకు తరలించారు. అరెస్టుతో పోలీసులు, భూ నిర్వాసితుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు లాఠీఛార్జ్ కూడా చేశారు.