– తల్లిదండ్రులను కడుపుకోతకు గురి చేయకండి
– సప్లిమెంటరీ సహా ఎన్నో అవకాశాలున్నాయి
– బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకోకండి
– ప్రభుత్వ వైఫల్యం వల్లే అత్యధిక ఫెయిల్యూర్స్
– అధ్యాపక పోస్టులను భర్తీ చేయకపోవడమే కారణం
– ఇకనైనా కేసీఆర్ రాజకీయాలు మానుకోవాలి
– విద్యాశాఖ ప్రక్షాళనపై దృష్టి సారించాలి
– బండి సంజయ్ డిమాండ్
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిలయ్యామనే బాధతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం మనసును తీవ్రంగా కలిచి వేస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పడుతున్న బాధను చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్షణికావేశంతో నూరేళ్ల జీవితాన్ని పాడుచేసుకోకండి అంటూ విద్యార్థులకు సూచించారు. మీపైనే ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చకండని కోరారు.
పరీక్షల్లో తప్పినంత మాత్రాన జీవితం ముగిసినట్లు కాదన్న బండి.. ఎంతో బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు రాసే అవకాశాలున్నాయని… భవిష్యత్తులో ఎదగడానికి మరెన్నో ఛాన్స్ లు ఉంటాయని ధైర్యం చెప్పారు. పోటీ ప్రపంచంలో మార్కులే అంతిమం అనే భావనతో పిల్లలపై తల్లిదండ్రులు లేనిపోని ఒత్తిడి పెంచొద్దని సూచించారు. జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లిన వాళ్లలో ఎంతోమంది పరీక్షల్లో ఫెయిలైన వారేనని… అధైర్యపడకుండా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని పై స్థాయికి వెళ్లారనే విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలని కోరారు.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యధిక శాతం మంది విద్యార్ధులు ఫెయిలవడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా కారణమన్నారు బండి. ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం రాజకీయాలే తప్ప విద్యాశాఖను పట్టించుకున్న పాపానపోలేదని విమర్శించారు. ఫలితంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వేలాది అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఏళ్ల తరబడి వాటిని భర్తీ చేయకపోవడంతో విద్యా ప్రమాణాలు కొరవడ్డాయన్న సంజయ్… చాలా కాలేజీల్లో సిలబస్ కూడా పూర్తి కాని పరిస్థితి ఉందని తెలిపారు. ఆ ప్రభావం విద్యార్థులపై పడటంతో చాలా మంది ఫెయిలవుతున్నారని చెప్పారు. సరిపడా అధ్యాపకులు, సౌకర్యాలున్న కళాశాలల్లో నూటికి నూరుశాతం ఫలితాలు వచ్చిన విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలన్నారు.
ఇకనైనా కేసీఆర్ రాజకీయాలు పక్కనపెట్టి విద్యాశాఖపై దృష్టి పెట్టాలని హితవు పలికారు బండి. ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పించాలని… నైతిక విలువలను అలవర్చడంతోపాటు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా అవగాహన కల్పించేలా విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాలన్నారు.