– కేసీఆర్ అవినీతిపై కేంద్రం దృష్టి
– త్వరలో ఎంక్వైరీ షురూ!
– అందుకే ఫ్రంట్ అంటూ డ్రామాలు
– తుక్డే గ్యాంగ్ తో కలుస్తావా?
– నీలో హిందూ వ్యతిరేక భావజాలం..
– ఎంత ఉందో అర్థం అవుతోంది!
– ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు నమ్మరు!
– పంచాయతీల నిధులపై చర్చకు సిద్ధమా?
– కేసీఆర్ పై విరుచుకుపడ్డ బండి
తెలంగాణ సీఎం కేసీఆర్ దేశంలోనే నెంబర్ వన్ అవినీతి పరుడని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం అత్యంత అవినీతికి పాల్పడిందని మండిపడ్డారు. తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్, ఆయన ఫ్యామిలీ ఆస్తులెన్ని? ఇప్పుడెన్నని ప్రశ్నించారు. మరి.. గిన్ని పైసలు యాడికెళ్లి వచ్చినయ్?.. ఈ అవినీతిపై కేంద్ర నిఘా సంస్థలు దృష్టి పెట్టాయని.. త్వరలోనే ఎంక్వైరీ షురూ కాబోతోందని తెలిపారు. ఈ విషయం తెలిసినప్పటి నుండి తండ్రీ, కొడుకు, అల్లుడు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని ఎద్దేవ చేశారు. “కుమారుడు ఏం మాట్లాడుతున్నాడో.. ఆయన నాలుకకు, మెదడుకు లింకు లేకుండా పోయింది. ఇగ ఈ పెద్ద మనిషి ఒకటే డిసైడ్ అయ్యిండు. వీళ్లెట్లాగూ నన్ను అరెస్ట్ చేస్తరు. అంతకంటే ముందే లొల్లి చేస్తే ఓ పనైపోతదని తెలిసి ఫ్రంట్ అని ముందేసుకున్నడు” అంటూ సెటైర్లు వేశారు.
నిజం చెప్పాలంటే.. ఫ్రంట్ లేదు టెంట్ లేదన్నారు బండి. అవినీతితో సంపాదించుకున్న పైసల మూటలను తీసుకుపోతుండని ఆరోపించారు. గతంలో చంద్రబాబు గిట్లనే చేసిండని.. చివరకు ఆయనకు ఏ గతి పట్టిందో కేసీఆర్ కూ అదే గతి పడుతుందని విమర్శించారు. కేసీఆర్ కు శని మీద కూర్చుందని… డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యిందన్నారు. అవినీతితో దోచుకున్న సొమ్మును దాచుకునేందుకు ఇదంతా చేస్తున్నారని.. తనపై కేంద్రం కేసులు పెడితే మిగితా రాష్ట్రాల సీఎంలు, నాయకులు అండగా ఉండాలనే ఏకైక లక్ష్యంతోనే కేసీఆర్ ఈ డ్రామా అంతా నడిపిస్తున్నారని ఆరోపించారు.
“మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, బెంగాల్ ప్రజలందరికీ నా విజ్ఞప్తి. ఈ దోకేబాజీని నమ్మొద్దు.. నమ్మినోళ్ల గొంతు కోస్తడు. తెలంగాణ ఉద్యమంలో 1400 మంది చనిపోతే అందులో సగం మందిని కూడా గుర్తించి సాయం చేయని దుర్మార్గుడు కేసీఆర్. తెలంగాణ రావడానికి కారణమైన ఉద్యోగ, నిరుద్యోగ, సబ్బండ వర్ణాలను మోసం చేసిండు. తెలంగాణ ప్రజలకు మళ్లా మళ్లా విజ్ఞప్తి చేస్తున్నా.. కేసీఆర్ దోచుకున్న కోట్ల రూపాయలు కక్కించాల్సిందే. కేంద్ర ప్రభుత్వం ఆయనను జైలుకు పంపించడం ఖాయం. ఇది తెలిసే సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండు” అని మండిపడ్డారు బండి.
ఇక నారాయణ్ ఖేడ్ లో కేసీఆర్ ప్రసంగంపై స్పందిస్తూ.. “రాష్ట్రం బంగారు తెలంగాణ అయ్యిందంట.. భారత దేశాన్ని బంగారు భారత్ చేస్తాడట.. రాష్ట్రం బంగారు తెలంగాణ అయ్యిందా… ఆత్మహత్యల తెలంగాణ అయ్యింది. దోపిడీ దొంగల తెలంగాణ అయ్యింది. నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నరు. చివరకు పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కులాల మధ్య, ప్రాంతాల, మతాల మధ్య చిచ్చు పెట్టడమే కేసీఆర్ పని. ఏదీ దొరకకపోతే ఉత్తర, దక్షిణ భారత దేశాలుగా విభజించి మాట్లాడతారు. కేసీఆర్ దోకేబాజీ మాత్రమే కాదు.. దేశంలోనే అతిపెద్ద ఝూటా ముఖ్యమంత్రి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామ పంచాయతీలకు సమయానికే డబ్బులు పంపిస్తున్నానని కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని అన్నారు బండి. చేసిన పనులకు పైసలు రాక సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. సభలో కింద కూర్చున్న సర్పంచ్ లు కేసీఆర్ మాటలు విని థూ.. అని ఊస్తున్నారని విమర్శించారు. తుక్డే గ్యాంగ్ ప్రకాష్ రాజ్ తో కలిశావంటే.. నీలో హిందూ వ్యతిరేక భావజాలం ఎంత ఉందో అర్థం అవుతోందని కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే.. పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, చైనా దేశాలను ఎవరూ తిట్టొద్దంటారని అన్నారు. అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముపై విచారణ జరగబోతోందని.. అందుకే తుక్డే గ్యాంగ్ తో కలిసి ప్రజల దృష్టి మళ్లించడానికే దేశాన్ని ఏలతానంటూ కొత్త డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఈ డ్రామా కంపెనీ దేశవ్యాప్తంగా తిరిగి ఇదే చెప్పబోతోందన్న బండి.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
“శివాజీ జయంతి ఉత్సవాలు ఎగ్గొట్టిన కేసీఆర్.. శివాజీ స్పూర్తితో ముందుకెళతారని చెబుతున్నారు.. సిగ్గుండాలి అలా చెప్పడానికి.. కేసీఆర్ తెలంగాణలో చేసిందేమీ లేదు. ఇగ దేశానికి పోయి ఏం ఉద్ధరిస్తాడు? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇవ్వకపోవడంతో జనం తిరగపడుతున్నారని తెలిసి కొత్త డ్రామాలు చేస్తుండు. దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తున్న మొట్టమొదటి సర్కార్ నరేంద్ర మోడీ ప్రభుత్వమేనని కేసీఆర్ చెప్పారు. అట్లాంటోడు మోడీ అవినీతి పరుడంటే నమ్మేదెవరు? కేసీఆర్ కు మేడారం అభివృద్ధికి చేసిందేమీ లేదు. మొఖం చెల్లకే వెళ్ళలేదు. చివరకు గవర్నర్ వెళ్తే కూడా అధికారులు, మంత్రులెవరూ ఆమెను కలవొద్దని అనధికార ఆదేశాలిచ్చిన సంస్కారం లేని వ్యక్తి కేసీఆర్. తొలుత గవర్నర్ ను పొగిడింది ఈయనే.. ఇప్పుడు అవమానిస్తోంది ఆయనే. తెలంగాణాకు అన్యాయం జరిగితే 7 ఏండ్లుగా ఎందుకు అడగలేదు? ప్రధానిని కలిసినప్పుడు ఎందుకు అడగలేదు? అసలు తెలంగాణను నాశనం చేసింది కేసీఆర్. కేసీఆర్ కు తెలంగాణలో ముఖం చెల్లడం లేదు. ఇంట్లో కూడా కొడుకు సీఎం పదవి ఇవ్వాలని లొల్లి చేస్తుండు. అందుకే జాతీయ రాజకీయాలంటూ డ్రామా చేస్తుండు. తెలంగాణలో బీజేపీ చేస్తున్న ఉద్యమాలకు భయపడి కేసీఆర్ ఫాంహౌజ్ నుండి బయటకొచ్చి డ్రామాలు చేస్తుండు. తెలంగాణ ద్రోహి కేసీఆరే. రాష్ట్రాన్ని నాశనం చేసింది కేసీఆరే. ఇప్పుడు తుక్డే గ్యాంగ్ తో కలిసి దేశాన్ని ఏలాలని కలలు కంటున్నడు. ప్రజలంతా ఆలోచించాలి” అని పిలుపునిచ్చారు.
నారాయణ్ ఖేడ్ సభలో కేసీఆర్ మాటలు చూస్తే.. కార్పొరేట్ కాలేజీలు ఇంటర్ రిజల్ట్స్ యాడ్స్ చెప్పినట్లు ఉందన్నారు బండి. టీవీల్లో 1…2…3..4…5 ర్యాంకులు మావే అని అన్నట్లు.. ఏ సభకు వెళ్లినా కోట్లు కోట్లు కోట్లు ఇస్తున్నట్లు ప్రకటిస్తున్నారు.. ఆ తర్వాత పైసలు రావు.. జీవో రాదని విమర్శించారు. హుజూర్ నగర్, సాగర్, దుబ్బాక, హుజూరాబాద్ సహా జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు గిట్లనే చెప్పిండని గుర్తు చేశారు. ఆయన మాటలు నమ్మితే అంతే సంగతులని.. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనం కేసీఆర్ గూబ గుయ్ మన్పించినా సిగ్గు రావడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినంక గ్రామ పంచాయతీలకు నిధులిచ్చిన దాఖలాల్లేవన్న బండి… కేంద్రం స్వచ్ఛ భారత్ మిషన్ సహా అనేక పథకాల ద్వారా ఇస్తున్న నిధులతోనే నడుస్తున్నాయని చెప్పారు. అయినా సిగ్గు లేకుండా కోట్లు ఇస్తున్నామంటూ పచ్చి అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహించారు.
గ్రామ పంచాయతీల నిధుల విషయంలో కేసీఆర్ కు సవాల్ చేశారు సంజయ్. 8 ఏళ్లుగా గ్రామ పంచాయతీలకు కేంద్రం నుండి వచ్చే నిధులు తప్ప ఆయనేం ఇచ్చింది లేదన్నారు. గతంతో పోలిస్తే ఏకంగా 38 శాతం నిధులను కేంద్రం పెంచిందని చెప్పారు. తెలంగాణలో గ్రామ పంచాయతీలన్నీ కేంద్ర నిధులతోనే నడస్తున్నాయన్నారు. గత 6 నెలల్లో ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది లేదన్న బండి… ఏకగ్రీవ పంచాయతీలకు కూడా నిధులివ్వలేదని ఆరోపించారు. స్థానిక సంస్థలకు నిధులివ్వలేని కేసీఆర్ కు.. కేంద్ర నిధుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు బండి సంజయ్.