కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మైండ్‌గేమ్ ఆడుతున్నారా? అన్న కోసం అదిష్టానాన్ని పరోక్షంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది. తాను బీజేపీలో చేరుతున్నానంటూ స్వయంగా రాజగోపాల్ రెడ్డి ప్రకటన చేసినా.. ఆయన పార్టీలోకి వచ్చే విషయం తనకు తెలియదంటూ స్వయంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మీడియాతో చెప్పడం ఈ సందేహాలకు బలాన్నిస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరును ఇవాళో, రేపు ప్రకటించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతోంది. అయితే రేవంత్ రెడ్డి తర్వాత ఆ పదవిని కోరుకుంటున్న వ్యక్తి కోమటిరెడ్డి వెంటకరెడ్డి కావడంతో.. ఆయన తమ్ముడైన రాజగోపాల్ రెడ్డి ఇలా చీకట్లో రాయి ఏమైనా విసురుతున్నారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో సరిగ్గా ఇలాగే పీసీసీ మార్పు చర్చ వచ్చిన సమయంలోనే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతానని ప్రకటించి ఆతర్వాత సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే నెలకొన్న సందర్భంలో.. అన్న కోసం ఏమైనా రాజగోపాల్ మళ్లీ మైండ్‌గేమ్ ఏమైనా ఆడుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ అన్న కోసం కాకపోయినా.. పార్టీలో తనకు మంచి పోస్టు దక్కించుకోవడం కోసమైనా ఇలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారేమో అన్న చర్చ కూడా జరుగుతోంది.