బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కొత్త ఐడియా వేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పదాధికారుల సమావేశానికి హాజరైన ఆయన.. కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా దరఖాస్తుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకం అని చెప్పుకునే పథకాలకు ఎవరినైతే ఎంపిక చేయలేదో వారికి అండగా ఈ దరఖాస్తుల కార్యక్రమం చేస్తున్నట్లు ప్రకటించారు.
సంక్షేమ పథకాలను అందుకోలేని వారి తరఫున పోరాడదామని పిలుపునిచ్చారు బండి. దళిత బంధు పథకం నుంచి నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, కుల సంఘాలు భవనాలు లాంటి అనేక పథకాలను అందుకోలేని లబ్ధిదారులు ముందుకు రావాలని చెప్పారు. ప్రజల కోసం బీజేపీ చేపట్టిన ఈ దరఖాస్తుల ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు.
అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసుల్లో ఈ దరఖాస్తులు అందించాలని సూచించారు బండి సంజయ్. ప్రభుత్వం దిగివచ్చే దాకా ఈ పోరాటం కొనసాగిస్తామన్నారు. హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిన కేసీఆర్… గిరిజన బంధు, బీసీ బంధు కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు బండి.