ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎర్రపాడ్ గ్రామ శివారులో బస చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. 24వ రోజు పొద్దున్నే శిబిరం పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లారు. పొలం గట్లపై తిరుగుతూ వరి పంటను పరిశీలించారు. అక్కడే ఉన్న రైతులతో కాసేపు ముచ్చటించారు.
వరి వేస్తే ఉరేనని సీఎం కేసీఆర్ భయపెడుతున్నారని రైతులు బండి సంజయ్ కి వివరించారు. ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రభుత్వం ప్రతీ గింజా కొనేలా చేస్తామని వారికి హామీ ఇచ్చారు బండి. ఆ తర్వాత అక్కడే ఉన్న బోరు నీళ్లతో మొహం కడుక్కొని శిబిరంలోకి వెళ్లిపోయారు. బండి సంజయ్ పొలాలు పరిశీలిస్తున్నారని తెలిసి.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆయన్ను కలిసేందుకు వచ్చారు.
పొలం గట్లే విడిది క్షేత్రాలుగా బండి సంజయ్ పాదయాత్రను కొనసాగిస్తున్నారని బీజేపీ నేతలు తెలిపారు. వ్యవసాయ క్షేత్రంలో శ్రమిస్తున్న రైతుల జీవనశైలిని, కష్టాలను తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్నారని వివరించారు. అలాగే చిరు వ్యాపారుల బాధలు స్వయంగా వింటున్నారని.. ఇవే రేపటి తమ మేనిఫెస్టోకు అంశాలని చెప్పుకొచ్చారు.