తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ఐదో విడుత ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా పడింది. ఈ విషయాన్ని కరీంనగర్ ఎంపీ బీజేపీ ప్రజా సంగ్రామ పాదయాత్ర ఇన్ చార్జి మనోహర్ రెడ్డి వెల్లడించారు. పాదయాత్ర ప్రారంభసభ రేపు ఉంటుందన్నారు.
న్యాయస్థానం నిబంధనల మేరకే పాదయాత్ర సభ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత నుంచి పాదయాత్ర మొదలవుతుందని ఆయన వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వారికి భరోసా ఇచ్చిందుకే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు.
టీఆర్ఎస్ సూచనల మేరకే పాదయాత్ర సభను అడ్డుకునే కార్యక్రమాలు చేశారని ఆయన ఆరోపించారు. భైంసా పట్టణం తమ లక్ష్యం కాదన్నారు. తెలంగాణ అంతటా పాదయాత్ర నిర్వహించడం తమ లక్ష్యమని ఆయన వివరించారు.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ 5వ విడత పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరికొద్దిసేపట్లో కరీంనగర్ నుండి బైంసాకు బీజేపీ చీఫ్ బండి సంజయ్, బీజేపీ శ్రేణులు బయలుదేరుతున్నారు. బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతిని హైకోర్టు ఇచ్చింది.
బైంసా సిటీకి మూడు కిలోమీటర్ల దూరంలో సభ నిర్వహిస్తే మాత్రమే అనుమతించాలని హైకోర్టు సూచించింది. బైంసా సిటీలోకి వెళ్లకుండా పాదయాత్ర కొనసాగించాలని నిబంధనలు పెట్టింది. కోర్టు తుదితీర్పు నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేతలతో బండి సంజయ్ సమావేశం నిర్వహించనున్నారు.