– మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రకు ప్లాన్
– ఆగస్టులోపు నాలుగో విడత పూర్తి చేయాలని నిర్ణయం
– 3, 4 విడతల్లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ
– మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర
– బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నిర్ణయం
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ వచ్చే నెల 23 నుండి జూలై 12 వరకు మూడో విడత పాదయాత్ర చేపట్టనున్నారు. ఇది మొత్తం 20 రోజులపాటు కొనసాగనుంది. అలాగే 4వ విడత పాదయాత్రను సైతం ఆగస్టులోపు పూర్తి చేయనున్నారు. మొత్తంగా 3, 4 విడతల పాదయాత్రలో భాగంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా పాదయాత్ర చేసేలా ప్రణాళిక రూపొందించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. ఇందులో పాదయాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. మూడు, నాలుగో విడత పాదయాత్రలను ఎక్కడి నుండి ప్రారంభించి ఎక్కడ ముగింపు చేస్తారనే విషయంపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. మొదటి, రెండో విడత పాదయాత్రల్లో భాగంగా బండి సంజయ్ 67 రోజులు పాదయాత్ర చేసి 828 కిలోమీటర్లు నడిచారు.
రెండు విడతల పాదయాత్రల్లో భాగంగా 13 జిల్లాల్లోని 9 ఎంపీ, 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నడవడంతోపాటు 66 సభలు నిర్వహించారు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షులుగా, ఎంపీగా కొనసాగుతున్నందున రాష్ట్ర హెడ్ క్వార్టర్ లో, పార్లమెంట్ సమావేశాలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉన్నందున.. జాతీయ నాయకత్వం సూచన మేరకు ప్రతినెలా 20 రోజులపాటు పాదయాత్ర చేస్తారని.. మిగిలిన 10 రోజులు ఆయా కార్యక్రమాలకు అందుబాటులో ఉంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
ఇక పదాధికారుల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ తీరుపై ఫైరయ్యారు. “ముఖ్యమంత్రి ఢిల్లీ, పంజాబ్ పోయి దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నరు. అబద్దాలను నిజాలుగా వల్లించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో రైతులు, ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు అసలు ఆత్మహత్యలే చేసుకోవడం లేదని, రాష్ట్రమంతా ఏ సమస్యా లేకుండా ప్రశాంతంగా ఉందన్నట్లుగా చేస్తున్నారు” అంటూ మండిపడ్డారు. ఈ విషయంలో జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలు, రాష్ట్ర నాయకులంతా ఎక్కడికక్కడ సీఎం తీరును ఎండగట్టాలని, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని కోరారు. రాష్ట్రంలో ఇటీవల మూడు బహిరంగ సభలు జరిగాయని అందులో టీఆర్ఎస్ ప్లీనరీ, రాహుల్ గాంధీ సభ, ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలు ప్రధానమైనవన్నారు. ఈ మూడు సభలను చూసిన ప్రజలు ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని భావిస్తున్నారని తెలిపారు.