– కేసీఆర్ వల్లే గిరిజన యూనివర్సిటీ ఆలస్యం
– త్వరలోనే ఆ కల నెరవేరుతుంది
– కల్వకుంట్ల రాజ్యాంగం అమలైతే..
– రిజర్వేషన్లు ఎత్తేయడం ఖాయం!
– కేసీఆర్ పై బండి ఆగ్రహం
తెలంగాణలో గిరిజన యూనివర్శిటీ కలను కేంద్రం త్వరలోనే నెరవేర్చుతుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ ప్రభుత్వ సహకారం లేనందునే వర్శిటీ ఏర్పాటులో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను నిర్వహించారు. బండి సంజయ్ పాల్గొని సేవాలాల్ మహారాజ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని తండాల్లో సంత్ సేవాలాల్ మహారాజ్ పేరిట ఆలయాలను నిర్మిస్తామని ప్రకటించారు.
సేవాలాల్ అడవులను నమ్ముకుని జీవనం సాగిస్తున్న గిరిజనులకు ఏ కష్టమొచ్చినా అధిగమించేలా చేసిన మహానుభావుడని కొనియాడారు. అప్పట్లోనే దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఎలాంటి లిపి లేకపోయినా 10 కోట్ల మంది గిరిజనులను ఏకం చేశారని గుర్తు చేశారు. బ్రిటీష్, ఇస్లాం పాలనలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకుని నిలబడ్డారని.. ప్రత్యేక తండాలను ఏర్పాటు చేయడంలో కృషి చేశారని చెప్పారు. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడటంలో ముందున్నారన్నారు.
ఆనాడు అడవులను నమ్ముకుని జీవిస్తున్న గిరిజనులకు సేవాలాల్ రక్షణ కవచంగా నిలబడితే.. నేడు సీఎం కేసీఆర్ మాత్రం అధికారుల ద్వారా దాడులు చేయించి అడవుల నుండి తరిమేస్తున్నారని మండిపడ్డారు బండి. ఎన్నికలొచ్చినప్పుడు పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ఓట్లు దండుకుని విస్మరించిన ఘనుడు కేసీఆర్ అంటూ సెటైర్లు వేశారు. తండాల్లో నేటికీ మంచి నీరు, రోడ్లు కనీస సౌకర్యాల్లేక గిరిజనులు అల్లాడుతున్నారని.. ప్రత్యేక నిధుల ఊసే ఇంతవరకు కేసీఆర్ ఎత్తడం లేదని విమర్శించారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లను కేటాయించినా కేసీఆర్ గిరిజనులకు ఇవ్వకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాల్లేక ఉపాధి కరువై తెలంగాణలో అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో గిరిజన యువకులే ఉన్నారని అన్నారు. దళిత, గిరిజనులకు రిజర్వేషన్ల ఫలాలు అందిస్తున్న అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసేసి.. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తెచ్చి ఆ రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ రాజ్యాంగం అమలైతే రిజర్వేషన్లు అమలు కావు, ఉద్యోగాలు రావు, ఇండ్లు రావు.. పోడు భూముల సమస్య పరిష్కారం కాదు.. ఏ ఫలాలు అందవన్నారు.
తెలంగాణలో గిరిజన యూనివర్శిటీని ఏర్పాటు చేసే బాధ్యత బీజేపీదన్న బండి… ఇప్పటికే ఈ విషయం కేంద్రం పరిశీలనలో ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే యూనివర్శిటీ ఏర్పాటులో జాప్యం జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో గిరిజనులకు రిజర్వేషన్లు అమలు చేయాలన్నదే బీజేపీ డిమాండ్ అని… మతపరమైన రిజర్వేషన్లతో కలిపి గిరిజనులకు రిజర్వేషన్ల బిల్లును కేంద్రానికి పంపడం విడ్డూరంగా ఉందన్నారు. ఎస్టీలకు రిజర్వషన్లు అమలు కాకుండా ఉండాలన్నదే కేసీఆర్ కుట్రలో భాగమని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తండాలను గుర్తించి తగిన అభివృద్ధి చేస్తామని.. ఎస్టీ రిజర్వేషన్లను పూర్తిస్తాయిలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు బండి సంజయ్.