– రాష్ట్రవ్యాప్తంగా సర్పంచుల అవస్థలు
– భారీ స్కెచ్ గీసిన బండి
– సర్పంచులతో కలిసి సమరభేరీ
– మౌన దీక్షకు ప్లాన్
– నిధుల మళ్లింపుపై యుద్ధం
– రాష్ట్రమంతా నిరసనలకు కార్యాచరణ
గ్రామానికి పెద్దన్న ఎవరంటే సర్పంచ్ అని ఠక్కున చెప్పేస్తారు. కానీ.. స్వరాష్ట్రంలో సర్పంచుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఈమధ్య వెలుగు చూసిన సంఘటనలే అందుకు నిదర్శనం. ఒకచోట సర్కారు నుంచి బిల్లుల డబ్బులు అందక భిక్షాటన చేస్తుంటే.. ఇంకోచోట కూలీ పనులకు పోతున్న పరిస్థితి. మరోచోట అయితే ఆత్మహత్యే శరణ్యం అని బోరున విలపిస్తున్న దుస్థితి. టీఆర్‌ఎస్ పాలనలో డబ్బులో చంద్రశేఖరా అని సర్పంచులు అడుగుతున్న పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
గ్రామాల్లో ప్రభుత్వం ఆదేశించే ప్రతీ పని సొంత ఖర్చులతో చేసుకుంటూ పోతున్నారు సర్పంచులు. బిల్లులు వచ్చాక ఆ డబ్బుతో సర్దుబాటు చేసుకోవచ్చులే అని ఏది చెబితే అది చేసేస్తున్నారు. కానీ.. చాలాచోట్ల సర్పంచులకు అప్పులే మిగిలాయి. బిల్లులు రాకపోవడంతో అప్పులు పెరగడం, వడ్డీలు మీదపడడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే తిరుగుబాటు జెండాను ఎగురవేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ సర్పంచులకు అండగా పోరుబాటకు సిద్ధమైంది.
పార్టీలకతీతంగా సర్పంచులు ఆందోళన బాట పడుతుండడంతో వారితో కలిసి సమరభేరీకి సిద్ధమౌతున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జూన్ తొలివారంలో మౌనదీక్షకు శ్రీకారం చుడుతున్నారు. హైదరాబాద్ లంగర్ హౌస్ లోని బాపుఘాట్ వేదికగా సర్పంచులతో కలిసి నల్లబ్యాడ్జీ ధరించి 2 గంటల పాటు మౌన దీక్ష చేపట్టనున్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా ఆలస్యం చేస్తుండడంతో.. బిల్లులు ఇచ్చే దాకా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈ దీక్షకు దిగుతున్నారు బండి.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో సర్పంచులకు అండగా నిరసన కార్యక్రమాలకు కూడా ప్లాన్ చేశారు సంజయ్. కేంద్రం గ్రామాల అభివృద్ధి కోసం నిధులు ఇస్తోందని.. కానీ.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లిస్తోందనేది బీజేపీ వాదన. అయితే.. టీఆర్‌ఎస్ వర్గాలు మాత్రం.. కేంద్రమే 15వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వకుండా తాత్సారం చేస్తోందని అంటున్నాయి. ఈ విషయం అర్థం చేసుకుని సర్పంచులు కాస్త ఓపిక పట్టాలని కోరుతున్నారు గులాబీ నేతలు.