కేసీఆర్ రాజ్యాంగం వ్యాఖ్యల విషయంలో బీజేపీ ఎంతకీ తగ్గడం లేదు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా భీమ్ దీక్షలు నిర్వహించిన కమలనాథులు.. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం నుండి పార్లమెంట్ వరకు భీమ్ పాదయాత్ర చేపట్టనున్నారు.
బండి సంజయ్ తోపాటు ఈ పాదయాత్రలో ఎంపీలు సోయం బాపురావు, అరవింద్, బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇంఛార్జ్ మునుస్వామి సహా పలువురు నేతలు పాల్గొననున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు భీమ్ పాదయాత్రను నిర్వహించనున్నారు బండి సంజయ్.
గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో భీమ్ దీక్షకు కూర్చున్నారు సంజయ్. కేసీఆర్ అహంకారంతో గర్వం తలకెక్కి మాట్లాడుతున్నారని ఆరోపించారు. దేశంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకురావాలని చూస్తున్న కేసీఆర్… గడీలు నిర్మించుకొని, తానే రారాజు అని భావిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కు సీఎం పదవి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పెట్టిన భిక్షేనన్నారు.
ఇటు రాజ్యాంగం మార్చాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ భీమ్ దీక్షలు చేపట్టింది. సీఎం క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు కొనసాగించారు.