ప్రజాసంగ్రామ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నా.. టీఆర్ఎస్ వాళ్లకు జనం కనిపించడం లేదన్నారు. పాదయాత్రలో ఎక్కడకు వెళ్లినా.. ప్రజలు తమ సమస్యలు చెబుతున్నారని.. అప్పుడెప్పుడో పాలమూరు ఎడారి అని వినేవాళ్లమని.. ఇప్పటికీ అలాగే ఉందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నియంతృత్వాన్ని నడిగడ్డ ప్రజలు ఎందుకు భరించాలని ప్రశ్నించారు బండి. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా గద్వాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సంజయ్.. కేసీఆర్ పాలనపై విరుచుకుపడ్డారు.
ఇది ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభ కాదని.. ఆర్డీఎస్ విజయోత్సవ సభ అని అన్నారు బండి. ఆరు నెలల్లోపు ఆర్డీఎస్ ద్వారా నడిగడ్డ ప్రజలకు నీళ్ళు ఇచ్చే బాధ్యత తనదని కేంద్ర మంత్రి హమీ ఇచ్చారని చెప్పారు. తెలంగాణ సీఎం కేఆర్ఎంబీకి సహకరించాలని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ కావాలా? ఆర్డీఎస్ ద్వారా నడిగడ్డకు నీళ్ళు అందించే బీజేపీ కావాలా? అనేది ప్రజలు ఆలోచన చేయాలన్నారు సంజయ్.
కేసీఆర్ ఇంట్లో ఐదు ఉద్యోగాలు ఉన్నాయని.. కానీ.. నిరుద్యోగులకు కనీసం భృతి కూడా ఇవ్వలేదని విమర్శించారు. 317 జీవో కోసం కోట్లాడితే తనను, బొడిగ శోభను జైలుకు పంపారని గుర్తు చేశారు. రైతు వేదికలు, పల్లె ప్రకృతులకు కేంద్రం డబ్బులు ఇస్తోందని వివరించారు. ఓ మంత్రి లెక్కలు తెలియక మాట్లాడుతున్నారని.. చెవులు పెద్దవి చేసుకుని వినమని వివరాలు తెలిపారు బండి. ఎంత చేస్తున్నా కేంద్రం ఏమిచ్చిందని టీఆర్ఎస్ నేతలు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారని అన్నారు.
కేసీఆర్ కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తున్నారని.. సర్పంచ్ లే మాట్లాడుకుంటున్నారని చెప్పారు బండి. పాతబస్తీలో గాయపడుతున్న కానిస్టేబుల్స్ ను బీజేపీ ప్రభుత్వం వచ్చాక అక్కడే అధికారులుగా చేస్తామని తెలిపారు. మహబూబాబాద్ లో కౌన్సిలర్ బానోత్ రవి నాయక్ ను ఎమ్మెల్యే అనుచరులు, టీఆర్ఎస్ నాయకులు హత్య చేశారని ఆరోపించారు. అవీనీతిపై, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రవి పోరాడుతున్నాడనే ఈ హత్య జరిగిందని.. ఇంకా గులాబీల ఆగడాలు ఇంకెన్ని చూడాలో అని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్.