బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 200 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మెదక్ పట్టణంలో సాగుతున్న పాదయాత్రలో రోడ్డుకు రెండువైపులా ఉన్న ప్రజలను కలుస్తూ బండి ముందుకు సాగుతున్నారు.
కార్పెంటర్ కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి రుణ సదుపాయం అందడం లేదని వారు వివరించారు. పాదయాత్రను చూసేందుకు, సంఘీభావం తెలిపేందుకు వేలాదిగా తరలివచ్చారు జనం. ముఖ్యంగా మహిళలు పెద్దఎత్తున వచ్చారు. వారితో మాట్లాడిన బండి.. ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి అడిగారు. టీఆర్ఎస్ సర్కార్ గడిచిన ఏడేళ్లలో తమకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ఇవ్వకుండా మోసం చేసిందని తెలిపారు మహిళలు.
ఇక హల్దీ వాగు కింద పోయిన భూముల బాధితులతోనూ మాట్లాడారు బండి. మండలంలోని కోంటూరు చెరువు కింద సాగు చేసే రైతులు బండి సంజయ్ కి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వాలు మారుతున్నాయి గానీ తమకు న్యాయం జరగడం లేదని వాపోయారు. ఎత్తిపోతల పథకం ద్వారా చెరువుకు నీరు అందిస్తామని ఎన్నికలప్పుడు హామీలివ్వడం తర్వాత మర్చిపోవడం ఎన్నో ఏళ్లుగా జరుగుతోందని వివరించారు. ఈ చెరువు కింద 7 గ్రామాలు కలిపి 3వేల ఎకరాల వరకు సాగు అవుతోందని.. బీజేపీ తమ కలను నెరవేర్చాలని కోరారు.
మెదక్ వ్యవసాయ మార్కెట్ దగ్గర రైతులతో కూర్చొని వారి సమస్యలు తెలుసుకున్నారు బండి సంజయ్. ఎన్నికలు వచ్చినప్పుడల్లా బూటకపు హామీలతో టీఆర్ఎస్ సర్కార్ తమను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. మోసపూరిత వైఖరితో పాలన సాగిస్తున్న టీఆర్ఎస్ ను బొందపెట్టి బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని అభిప్రాయం వ్యక్తం చేశారు.