ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. అది బీజేపీతోనే సాధ్యమన్నారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా మన్నెంకొండ చౌరస్తా దగ్గర మీడియాతో మాట్లాడిన బండి.. కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. పాలమూరు ఉమ్మడి జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రకు విశేష స్పందన వస్తోందని ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని చెప్పారు. కేసీఆర్ జిల్లాను సస్యశ్యామలం చేస్తానని మోసం చేశారని విమర్శించారు. ఇక్కడి ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, వారి కష్టాలను తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు.
‘‘ఆర్డీఎస్ సమస్య అలానే ఉంది. దళితులకు 3 ఎకరాలు, దళితబంధు లేనే లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించక రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఫాంహౌస్ లో తాగి పడుకోడానికి అధికారం ఇవ్వలేదు. ముందు వడ్లు కొనుగోలు చెయ్. 75 శాతం ధాన్యాన్ని రైతులు నష్టానికి అమ్మేసుకున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో అకాల వర్షాల కారణంగా రైతాంగం నష్టపోయింది. రైతులను రాజులను చేయాలన్న ఉద్దేశంతో మోడీ మద్దతు ధర పెంచుతూ వస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనటువంటి సమస్యను తెలంగాణలో కేసీఆర్ సృష్టించారు. నష్టపోయిన రైతన్నలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి’’ అని డిమాండ్ చేశారు బండి సంజయ్.
ఏదో తూతూ మంత్రంగా చర్యలతో తప్పించుకుందాం అనుకుంటే వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కమిటీలు, నివేదికల పేరుతో కాలయాపన చేస్తే ఊరుకోమన్నారు. కేసీఆర్ మూర్ఖపు పాలనలో ఏనాడూ రైతన్నను ఆదుకోలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘ఫసల్ బీమా యోజన అమలు చేయడు. బోనస్సులు ఇవ్వడు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించమంటే తగ్గించడు. ఎక్కడ డీజిల్ ధర తక్కువ ఉంటే.. అక్కడే తీసుకోమని ఆర్టీసీనే ఆదేశాలు ఇచ్చింది. కర్ణాటకలో రూ.15 వరకు తక్కువ ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ ఉన్నాయని ఆర్టీసీ ఇచ్చిన లేఖతో స్పష్టమైంది’’ అని అన్నారు సంజయ్.
ఆర్టీసీ కార్మికులు వాస్తవ విషయాలను ప్రజలకు తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు బండి. రాజకీయాలు, విమర్శలు, ప్రతి విమర్శలు పక్కన పెడదామని.. కలిసి రైతన్నలను ఆదుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ కేబినెట్ లో ఉద్యమకారులు ఉన్నారా? కేసీఆర్ కు ఎడమ, కుడి వైపు ఉన్న వారు ఒకప్పుడు బల్లాలు, బరిసెలు పట్టుకుని ఆయన్నే తంతాం అన్నవాళ్లేగా అని గుర్తు చేశారు. నిజమైన ఉద్యమకారులు తెరమరుగయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎం పార్టీని చంకలో వేసుకుని కేసీఆర్ తిరుగుతున్నారని విమర్శించారు. కేసీఆర్ తీరుతో అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని.. తెలంగాణ తల్లిని బంధవిముక్తిరాలిని చేస్తామని తెలిపారు. దానికి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. నీతి, నిజాయితీతో కూడిన పాలన అందించేది బీజేపీ మాత్రమేనన్న బండి.. తెలంగాణలో ఇప్పటి వరకు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారు.. ఈ ఒక్కసారి బీజేపీకి ఇస్తే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే పాలన అందిస్తామని తెలిపారు.