తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమ ద్రోహులు శాసిస్తున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా లింగంపేటలో ప్రసంగించారాయన. ఈ సందర్భంగా కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం 14వందల మంది బలిదానాలతోనే ఏర్పడిందని గుర్తు చేశారు. కేసీఆర్, ఆయన కుటుంబం చేసిందేమీ లేదని విమర్శించారు. అసలైన ఉద్యమకారులను దూరంపెట్టి ద్రోహులుగా పనిచేసిన వారిని కేసీఆర్ పక్కన పెట్టుకుని పాలన సాగిస్తున్నారని నిప్పులు చెరిగారు.
శ్రీకాంతా చారి, పోలీస్ కిష్టన్న, యాదిరెడ్డి, సుమన్ లాంటి అమరుల త్యాగాన్ని కేసీఆర్ అనుభవిస్తున్నారని ఆరోపించారు బండి. గాదె ఇన్నన్న, పాశం యాదగిరి, అందెశ్రీ లాంటి వారిని దూరం పెట్టి… ఉద్యమకారులను ఉరికిస్తామన్న వారిని పక్కన పెట్టుకున్న కేసీఆర్ కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. అధికారంలోకి రాకముందు ఇంటికో ఉద్యోగం, దళిత ముఖ్యమంత్రి, నిరుద్యోగ భృతి, మూడు ఎకరాల భూమి, రుణమాఫీ, పోడు భూములకు పట్టాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని వాగ్ధానం చేసిన కేసీఆర్.. అన్ని హామీలను తుంగలో తొక్కి కుటుంబ పాలన చేస్తున్నారని మండిపడ్డారు.
తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను హరితహారం పేరుతో ప్రభుత్వం లాక్కుంటోందని విమర్శించారు బండి. పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా గిరిజన రైతుల పొట్టమీద కొడుతోందన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, వారికి అన్యాయం చేయొద్దని గుర్రంపోడు దగ్గర నిరసన చేస్తే తమపై లాఠీచార్జి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 మంది బీజేపీ కార్యకర్తలను జైల్లో పెట్టారని తెలిపారు. పేద ప్రజల కష్టాలు కేసీఆర్ కు పట్టడం లేదన్నారు. వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం ఫామ్ హౌస్ లో పడుకున్నారని.. తాము మాత్రం ప్రజలకు సేవ చేశామని గుర్తు చేశారు.
ఇంటర్ విద్యార్థులు, ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం స్పందించేలేదన్న బండి.. తాము పాదయాత్ర చేస్తే.. అమిత్ షా నిర్మల్ లో సభ పెడితే మత విద్వేషాలను రగిలిస్తున్నామని ఆరోపిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపితే విద్వేషమా..? అని నిలదీశారు. తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని.. హిందూ ధర్మానికి కించపరిస్తే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు. అసలు.. కేసీఆర్ ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకిస్తున్నారా.. ఒప్పుకుంటున్నారా..? అనేది చెప్పాలని డిమాండ్ చేశారు.
వరి వేస్తే ఉరి అని కేసీఆర్ రైతులను నట్టేట ముంచుతున్నారని విమర్శించారు బండి. కేసీఆర్ పాలన రాకముందు ప్రతి ఊరిలో కిలోమీటర్ కో పాఠశాల ఉండేదని.. ఇప్పుడు బార్, వైన్స్ కనిపిస్తున్నాయని సెటైర్లు వేశారు. రాబోయే కాలంలో మద్యం తాగితేనే పెన్షన్ వస్తుందని చెప్పినా ఆశ్చర్యం లేదన్నారు. కేసీఆర్ పాలనలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్న ఆయన.. కేంద్రం ఇచ్చే నిధులతోనే రకరకాల పేర్లు పెట్టి అమలు చేస్తున్నారని ఆరోపించారు. 2023లో గొల్లకొండ(గోల్కొండ)పై బీజేపీ జెండా ఎగురవేసేందుకు ప్రతీ బీజేపీ కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా లింగపేటలో నక్సల్స్ కాల్పుల్లో మృతి చెందిన బీజేపీ కార్యకర్త శివకుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి బండి సంజయ్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, బీజేవైఎం రాష్ర్ట అధ్యక్షుడు భాను ప్రకాష్ సహా పలువురు పాల్గొన్నారు.