– 14న తుక్కుగూడ సమీపంలో బహిరంగ సభ
– అమిత్ షాను తీసుకొస్తున్న రాష్ట్ర శాఖ
– జిల్లా, మండల, రాష్ట్ర నేతలతో బండి టెలీకాన్ఫరెన్స్
– కనీవినీ ఎరగని రీతిలో ముగింపు సభకు ప్లాన్
– కరెంట్ ఛార్జీల పెంపుపైనా ర్యాలీలకు ఆదేశం
– నాగరాజు హత్యపైనా ఊరూవాడ నిరసనలకు పిలుపు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆపార్టీ. ఈనెల 14న మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడ సమీపంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతున్నారు. లక్షలాది మందితో ఈ సభను నిర్వహించేందుకు సిద్ధమైంది బీజేపీ.
కాంగ్రెస్ ఇటీవల వరంగల్ లో నిర్వహించిన రాహుల్ గాంధీ సభ కంటే నాలుగైదు రెట్ల జనంతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే సంకేతాలను గట్టిగా ప్రజల్లోకి పంపాలని భావిస్తోంది. అందులో భాగంగా బండి సంజయ్ గత రెండ్రోజులుగా వరుసగా పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. జిల్లాల వారీగా టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. శనివారం జీహెచ్ఎంసీ పరిధిలోని బీజేపీ కార్పొరేటర్లతో సమావేశమైన బండి పాదయాత్ర ముగింపు సభ విజయవంతానికి అవసరమైన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఆదివారం పార్టీ మండలాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులతో వేర్వేరుగా టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో చేపట్టిన రెండో విడత పాదయాత్ర ఉమ్మడి పాలమూరు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోందని.. ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందన్నారు బండి. ఎక్కడికి వెళ్లినా అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి సమస్యలను చెప్పుకుంటున్నారని చెప్పారు. పాలమూరు జిల్లా ఎడారిని తలపిస్తోందని, ఎటు చూసినా సమస్యలే తాండవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు దుస్థితి చూసి చలించని, కన్నీళ్లు పెట్టని వారుండరని అన్నారు. జనం స్వచ్ఛందంగా పాదయాత్రకు తరలివస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైందని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అలంపూర్, గద్వాల్, మక్తల్, నారాయణపేట, మహబూబ్ నగర్ కేంద్రాల్లో నిర్వహించిన బహిరంగ సభలు సక్సెస్ అయ్యాయని చెప్పారు. వీటికి కొనసాగింపుగా కనీవినీ ఎరుగని రీతిలో పాదయాత్ర ముగింపు సభ ఉండాలని తెలిపారు.
పాదయాత్ర ముగింపు సభకు అమిత్ షా విచ్చేస్తున్నారనే విషయాన్ని ఊరూవాడా ప్రచారం చేయాలని కోరారు బండి. ఎక్కడిక్కడ డప్పు చాటింపులు, ర్యాలీలు, మీడియా సమావేశాలతోపాటు సోషల్ మీడియా ద్వారా విస్ర్ర్తత ప్రచారం నిర్వహించి ప్రతి ఒక్కరూ సభకు హాజరయ్యేలా చూడాలని పేర్కొన్నారు. దీంతోపాటు సోమవారం నుండి మండలాలు, జిల్లాల కేంద్రాల్లో కరెంట్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని, కరెంట్ బిల్లులను దగ్దం చేయాలని పిలుపునిచ్చారు బండి. అలాగే ఇటీవల హత్యకు గురైన నాగరాజు ఘటనలో ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు తెలపాలని సూచించారు.
మరోవైపు 25వరోజు ప్రజా సంగ్రామ యాత్రలో 300 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు బండి సంజయ్. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బండి కేక్ కట్ చేశారు.