బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 31వ రోజుకు చేరుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రలో ప్రజలు భారీగా తరలివచ్చి వారి సమస్యలు చెబుతున్నారు.
ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ క్రాస్ రోడ్డు దగ్గర బండిని కలిసిన గ్రామస్తులు ప్రభుత్వ పథకాలు ఏవీ అందడం లేదని వాపోయారు. చుట్టూ వాగులు ఉన్నాయని.. వర్షాకాలం వస్తే జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా, మండల కేంద్రానికి వెళ్లాలన్నా అవి దాటలేక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. వారందరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చిన బండి.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామానికి చెందిన దళిత కుటుంబాలు బండి సంజయ్ ని కలిశాయి. కేసీఆర్ ప్రభుత్వం దళిత వర్గాలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, అస్తవ్యస్త విధానాలతో మోసం చేస్తున్నారని ఓయూ జాక్ నేతలు మండిపడ్డారు. అంబేద్కర్ చిత్రపటాన్ని చేతబూని బండి సంజయ్ తో పాటు పెద్దఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు.
ఇల్లంతకుంట, ముస్కాన్ పల్లి, కేతన్ పల్లి మీదుగా కల్లెపల్లి వరకు బండి పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి కల్లెపల్లి దగ్గర బస చేస్తారాయన. 31వరోజు 15.6 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. కర్నాటక ఎంపీ మునుస్వామి సహా పలువురు బీజేపీ నేతలు బండి యాత్రలో పాలుపంచుకోనున్నారు.