పేదల రక్తం తాగుతూ కోట్లు దండుకుంటున్నదుర్మార్గుడు కేసీఆర్ అనీ.. దేశంలోని అట్టడుగు వర్గాల అభివృద్ధికి పాటుపడేది ప్రధాని మోడీ అని అన్నారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. వడ్డించేవాడు కూడా పేదోడే అయితేనే పేదవాడి ఆకలి తీరుతుందని..అందుకే మోడీ వచ్చాక..పేదల కడుపులోని నాలుగు ముద్దలు పోతున్నాయని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి ఇంజనీరింగ్,డాక్టర్ వంటి విద్యను సైతం ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు.ఎంత పెద్ద రోగమొచ్చినా ఫ్రీగా చికిత్స చేయిస్తామన్నారు బండి. కేంద్ర పథకాలు దక్కాలంటే బీజేపీకే అధికారం ఇవ్వాలని..9వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజలకు పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదు.డబుల్ బెడ్రూం ఇండ్లు ఇయ్యలే. ఉద్యోగాలియ్యలే. నిరుద్యోగ భ్రుతి ఇయ్యలే.దళితులకు మూడెకరాలు ఇయ్యలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత అయితది.అందుకే ఈసారి టీఆర్ఎస్ నేతలు మీ వద్దకు వస్తే చెట్టుకు కట్టేయండి.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని నిలదీయండి. ఆ రోజు మీరు అరిచే అరుపులకు టీఆర్ఎస్ నేతల చెవుల్లోనుండి రక్తం కారాలే..అని భావోద్వేగంతో ప్రసంగించారు.
శుక్రవారం శెట్టి అత్మకూర్ స్టేజీ నుండి జూరాల మీదుగా నందిమల్ల గ్రామం వరకు మొత్తం 17 కిలోమీటర్లు నడిచారు.బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ,జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి సహా పలువురు రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.పాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.మదన పల్లి స్టేజీ,ఈడిగొని పల్లి స్టేజీ వద్ద పెద్ద ఎత్తున జనం తరలి వచ్చి సంజయ్ కు స్వాగతం పలికారు. ఈడిగొని పల్లి స్టేజీ తర్వాత మున్నురుకాపు సంఘం సంజయ్ ని ఘనంగా సన్మానించింది. పెద్దపాడులో వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
మండుటెండను సైతం లెక్కచేయకుండా పాదయాత్రను కొనసాగించారు బండి. పెదపాడు గ్రామం దాటిన తరువాత మధ్యాహ్నభోజనం చేసిన బండి సంజయ్ కొద్దిసేపు విరామం అనంతరం చిన్నపాడ్,యమ్ములోని పల్లి,చింత రేవులలో పాదయాత్ర చేశారు.ఈ సందర్భంగా చింత రేవులలో ‘‘జనం గోస – బీజేపీ భరోసాపేరిట నిర్వహించిన గ్రామసభలో స్థానికులు హాజరై తమ సమస్యలను మొరపెట్టుకున్నారు.ఫించన్ రావడం లేదని కొందరు, ఇండ్లు మంజూరు కాలేదని ఇంకొందరు…తమకు ప్రభుత్వం నుండి ఏ పథకం కూడా అందడం లేదని ఇంకొందరు సంజయ్ ఎదుట వాపోయారు.ఈ సందర్భంగా చింత రేవుల ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు.