– 69 జీవో అమలు..2 లక్షల ఎకరాలకు నీరు
– కేసీఆర్ ను వదలం..ప్రతి గింజా కొనిపిస్తాం
– రైతు సదస్సులో బండి సంజయ్
Advertisements
వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రాన్ని బద్నాం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన ఎత్తుగడలన్నీ బెడిసికొట్టాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 17వరోజు నారాయణపేట నుండి పాదయాత్ర ప్రారంభించారు.దారి పొడువునా మంగళహారతులతో పూల మాలలతో జనం ఆహ్వానం పలికారు. బీజేపీ కార్యకర్తల కోలాహలం నడుమ యాత్ర సాగిస్తున్నబండి..దారిలో ఊరూరా పార్టీ జెండాలను ఆవిష్కరిస్తున్నారు.సింగారం గేట్ దగ్గర ‘రైతు సదస్సు’లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.
వడ్ల కొనుగోలు విషయంలో కేసీఆర్ డ్రామా పండకపోవడంతో దిగొచ్చారని అన్నారు బండి.ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు టీఆర్ఎస్ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో… రాజకీయంగా పార్టీకి పుట్టగతులుండవనే భయం ఏర్పడిందని విమర్శించారు.కేసీఆర్ గతంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు జయమ్మ చెరువు సహా మిగిలిన వాటన్నింటికీ నీళ్లందిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు.ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే 69 జీవోను అమలు చేయాల్సిందేనన్నారు.
రైతుల సమస్యలన్నీసావధానంగా విన్నబండి..”మీరేం బాధ పడొద్దు..మీకు అండగా నేనున్నా…నరేంద్రమోడీ ప్రభుత్వం ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 69 జీవోను అమలు చేస్తాం.. 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం” అని హామీ ఇచ్చారు.ముఖ్యమంత్రి రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. “రైతులందరికీ సన్న వడ్లు వేయాలని చెప్పి తన ఫాంహౌస్ లో మాత్రం దొడ్డు వడ్లు వేసుకుని కోటీశ్వరుడైతున్నడు..రైతులను మాత్రం బికారీలుగా మారుస్తున్నడు. కొన్ని ప్రాంతాల్లో వరి తప్ప వేరే పంట వేసే పరిస్థితి లేదు.కానీ వరి వేస్తే ఊరే గతి అని భయపెట్టిండు..కనీసం ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించలేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులెవరూ కేసీఆర్ మాటలను పట్టించుకోవడం లేదన్నారు బండి.యూరియా ఫ్రీగా ఇస్తానని మాట తప్పారని..సబ్సిడీలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు.రైతుల పక్షాన తాము పోరాడితే తనపైన రాళ్లతో దాడి చేయించారని,అయినా భయపడకుండా పోరాడుతున్నామన్నారు.వడ్ల కొనుగోలు విషయంలో రైతులెవరూ బాధపడాల్సిన పనిలేదని..ప్రతి గింజా కొనిపించే దాకా కేసీఆర్ ను బీజేపీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు బండి సంజయ్.