బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. 19వ రోజు ధన్వాడ మండలం మణిపూర్ తండాలో దాదాపు 300 మంది ఉపాధి హామీ కూలీలు ఆయన్ను కలిశారు. తమ గోడును వెళ్లబోసుకున్నారు. వారితో మమేకమైన బండి నేల మీదే కూర్చొని సమస్యలు సావధానంగా విన్నారు. తమకు అదనంగా కనీసం 50 రోజుల పనిదినాలు అయినా పెంచాలని కోరారు కూలీలు. పులులున్నా కూడా గుట్టల్లో పనికోసం వెళ్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం తమకు రోజూ కూలీ రూ.257+20 ఇస్తున్నారని బండికి వివరించారు కూలీలు. ధన్వాడలో పని దొరకడం లేదని రోజుకూలీ అదనంగా కనీసం రూ.250 అయినా పెంచాలని కోరారు. గత 3 నెలలుగా కూలీ డబ్బులు ఇవ్వలేదని చెప్పడంతో బండి సంజయ్ కేసీఆర్ సర్కార్ పై తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రం 100 రోజుల పని దినాలు ఇచ్చిందని అన్నారు. ఉపాధిహామీ పథకం కింద కూలీ డబ్బులను ప్రతి నెల వారానికి ఒకసారి రాష్ట్రానికి నిధులు విడుదల చేస్తోందని తెలిపారు.
ఎండాకాలం అదనంగా రూ.20 కూలీ కేంద్రం ఇస్తోందని చెప్పారు బండి. మోడీ మీ పైసలు ఆపే పరిస్థితి లేదని.. ఇక్కడ ఆపేది కేసీఆర్ ప్రభుత్వమేనని విమర్శించారు. అదనంగా 50 రోజుల ఉపాధిహామీ పనిదినాలు పెంచాలని మోడీని కోరుతానని హామీ ఇచ్చారు. కేంద్రం రాష్ట్రానికి ఉపాధిహామీ కూలీ డబ్బులు ఇస్తుంటే… మీకు ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. కూలీలతో గొడ్డు చాకిరీ చేయించొద్దు.. తాగునీరు ఇవ్వాలి.. డాక్టర్ ను పెట్టాలి.. టెంట్లు వేయించాలనే నిబంధనలు ఉన్నా.. వాటిని కేసీఆర్ అమలు చేయడం లేదని మండిపడ్డారు.
మీ డబ్బులు మీకు ఇప్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్న బండి.. ఇకపై నేరుగా కూలీ డబ్బులు అకౌంట్లలో పడేలా మోడీతో మాట్లాతానని తెలిపారు. కేసీఆర్ మాటలతో వినరని.. కొట్లాడితేనే వింటారని అన్నారు. మంగళవారమే మొత్తం లెక్కలు తెప్పిస్తానని… అన్యాయం చేసిన వాళ్ళ లెక్క చూస్తామని చెప్పారు. అవసరమైతే కేసులు పెట్టి జైలుకి పంపిస్తామని హామీఇచ్చారు. “కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడం లేదు. పెన్షన్స్ ఇవ్వడం లేదు. 5 కిలోల బియ్యం ఫ్రీగా మోడీ ఇస్తున్నారు.. కిలోకి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు.. మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగితే గల్లా పట్టి నిలదీయండి. కేసీఆర్ బియ్యాన్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాడు. పేదలకు బియ్యం, వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తున్నాం. వారి కష్టాలు, బాధలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నా” అని చెప్పారు బండి సంజయ్.
కేంద్రంలో మోడీ నిధులు ఇస్తుంటే.. ఇక్కడ కేసీఆర్ వడ్డించడం లేదని మండిపడ్డారు. కమీషన్లకు కక్కుర్తి పడి ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నారని.. ఇక్కడ కూడా పేదల ప్రభుత్వం వస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. “నమ్మించి గొంతు కోయడంలో కేసీఆర్ దిట్ట. ఇప్పుడు ఎన్నికలు లేవు, ఓట్ల కోసం మేము రాలేదు. మీ సమస్యలు తెలుసుకునేందుకే వచ్చాం. మోడీ ఇచ్చే పైసలు న్యాయంగా మీకు చేరేలా చేయడమే మా ధ్యేయం. ఇక బాంఛన్ బతుకులు వద్దు” అంటూ ఉపాధి హామీ కూలీలలో ధైర్యం నింపారు బండి సంజయ్.