కేసీఆర్ తరతరాలు తరగని ఆస్తులను సంపాదించారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం చిప్పలపల్లి గ్రామంలోని బొడ్రాయి దగ్గర రచ్చబండలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. కొత్త పెన్షన్స్ ఇవ్వడం లేదు.. బైక్ ఉందని బియ్యం కట్ చేశారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేయగా.. ఐదేళ్లుగా తనకు పింఛన్ రావడం లేదని ఓ వృద్ధురాలు తెలిపింది. ఒక్క ఫ్యాన్ ఉంటేనే వెయ్యి రూపాయల కరెంట్ బిల్లు వస్తోందని ఒకరు.. డబుల్ బెడ్రూం ఇవ్వలేదని ఇంకొకరు.. దళిత బంధు రాలేదని మరొకరు.. ఇలా అనేక మంది తమ బాధలను బండికి వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సంజయ్.. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
12వ తేదీ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలోకి రాష్ట్రాన్ని కేసీఆర్ దిగజార్చారని విమర్శించారు. కానీ.. తన కుటుంబంలో మాత్రం 25 లక్షల జీతం తీసుకుంటున్నారని అన్నారు. టీఆర్‌ఎస్ వాళ్లకు జాగా కనపడితే చాలు గుంజుకుంటున్నారని మండిపడ్డారు. పేదలకు ఇండ్లు ఇవ్వని కేసీఆర్.. తాను మాత్రం రూ.800 కోట్లతో 100 గదుల ఇల్లు కట్టుకున్నారని విమర్శించారు. ఆయన్ను కలవడానికి వెళ్లినా జైల్లో వేసే పరిస్థితి నెలకొందని ఫైరయ్యారు.
పేదలకోసం కొట్లాడితే తనను కూడా జైల్లో పెట్టారని గుర్తు చేశారు బండి. ఎన్నికల ముందు ఇచ్చే హామీలను కేసీఆర్ నెరవేర్చరని.. ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోరని ఆరోపించారు. పేదలకు ఫ్రీగా బియ్యం మోడీ ఇస్తుంటే.. కేసీఆర్ అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ఫ్రీగా రెండు డోసుల వ్యాక్సిన్ పేదలకు ఇచ్చిన ఘనత మోడీదేనని తెలిపారు. బియ్యానికి కేజీకి రూ.29 భరించే మోడీ గొప్పోడా? రూపాయి భరించే కేసీఆర్ గొప్పోడా? అని ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు.
ఆర్టీసీ వాళ్లను కేసీఆర్ సర్వనాశనం చేశారని విమర్శించారు సంజయ్. ఇస్తానన్న పీఆర్సీ ఇవ్వలేదని అన్నారు. అలాగే ఇంటికో ఉద్యోగం అన్నారు.. ఇవ్వలేదు.. నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు.. ఇవ్వలేదు.. ఇలా ప్రతీసారి ప్రజలను కేసీఆర్ మోసం చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ప్రతీ ఒక్కరిపై కేసీఆర్ లక్ష రూపాయల అప్పు చేశారని విమర్శించారు. అన్నీ ఇస్తోంది మోడీనే.. ఇచ్చేటోడికే అధికారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈసారి కేసీఆర్ కు ఓటు వేసే అవకాశమే లేదని.. ఒక్కసారి పువ్వు గుర్తుకు వేయాలన్నారు. ఎన్నికలొస్తేనే టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రజల దగ్గరకు వెళ్తాయని ఆరోపించారు. ప్రస్తుతం ఎన్నికలు లేవని.. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు బండి సంజయ్.