బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఏడో రోజు చిట్టెంపల్లి నుంచి యాత్రను ప్రారంభించారాయన. వేలాదిగా యాత్రకు ప్రజలు తరలి రావడంతో కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు కదులుతున్నారు.
కండ్లపల్లిలో గొర్రెల కాపరులను పలకరించారు బండి. ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా అని వాకబు చేశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదని.. ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవడం లేదని.. గొర్రెల స్కీం ఇంతవరకు వర్తింపుకాలేదని వారు ఆవేదన చెందినట్లుగా చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ప్రజలకు తెలిపేందుకే.. కేసీఆర్ సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నానని అన్నారు బండి సంజయ్.
ఆదివారంతో బండి పాదయాత్ర వంద కిలోమీటర్లు పూర్తవుతుందని ప్రజా సంగ్రామ యాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా యాత్రలో వంద మంది నిరుద్యోగులు పాల్గొననున్నట్లు చెప్పారు. నిరుద్యోగులతో చర్చిస్తూ బండి ముందుకు వెళ్తారని వివరించారు.
ఇక పాదయాత్రలో భాగంగా ఈనెల 4న వికారాబాద్ లో జరిగే సభకు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరు కానున్నారు. అలాగే 7న సంగారెడ్డిలో జరిగే సభకు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య రానున్నారు. 10న వినాయక చవితి సందర్భంగా పాదయాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు బండి సంజయ్.