బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ఆగస్టు 2న యాదాద్రి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి యాత్ర ఇంఛార్జ్, మునుగోడు నియోజకవర్గ పార్టీ బాధ్యులైన గంగిడి మనోహర్‌రెడ్డితో పాటు భువనగిరి పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులు, ముఖ్య నేతలతో ఇప్పటికే పార్టీ రాష్ట్ర నాయకత్వం సమీక్ష నిర్వహించింది. తాజాగా యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ విడుదల చేశారు.
బండి సంజయ్ సంగ్రామ యాత్ర కి భారీ స్పందన వస్తుందని.. యాత్ర ప్రభావం క్షేత్ర స్థాయిలో ఉందని చెప్పారు ప్రజా సంగ్రామ యాత్ర ఇంఛార్జ్ మనోహర్ రెడ్డి. ఏడాదిలో పది పెద్ద బహిరంగ సభలు నిర్వహించిన పార్టీ బీజేపీ అని.. సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత యడాద్రి నుండి ఆగస్ట్ 2న ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. భువనగిరి పార్లమెంట్ లో 6 అసెంబ్లీ, వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉంటుందనన్నారు.
కాగా, మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర 23 రోజుల పాటు కొనసాగనుంది. 6వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా యాత్రకు విరామం ఉంటుందని మనోహర్ రెడ్డి చెప్పారు. మొత్తం 125 గ్రామాల మీదుగా 328 కిలోమీటర్ లు యాత్ర ఉంటుందని.. ఆగస్ట్ 26 న భద్రకాళి అమ్మవారి దగ్గర ముగియనుంది.
యాత్ర వెళ్ళే రూట్ లోకి అసెంబ్లీ నియోజక వర్గాల కి పార్టీ సీనియర్ నేతలు సమన్వయ కర్తలుగా నియమించామని.. భారీ బహిరంగ సభ తో యాత్ర ప్రారంభం అయ్యి భారీ బహిరంగ సభతో ముగుస్తుందని వెల్లడించారు.