పాతబస్తీ వీధులు కాషాయరంగుతో నిండిపోయాయి. టీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా సమరశంఖం పూరించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. చార్మినార్ సాక్షిగా.. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ సహా పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు.
కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెప్పాలని అమరవీరుల కుటుంబాలు ఆశ పడుతున్నాయని అన్నారు బండి సంజయ్. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని విమర్శించారు. ఇంటిగో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ మాట తప్పారు.. ఆఖరికి నిరుద్యోగ భృతి విషయంలోనూ మోసం చేశారని మండిపడ్డారు. ఒక్కో నిరుద్యోగికి ముఖ్యమంత్రి లక్ష రూపాయలు బాకీ ఉన్నారని అన్నారు బండి.
సీఎం కరోనా వస్తే బయటకు రారు.. వరదలు వస్తే రారు.. రైతులు ఇబ్బందులు పడినా రారని విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని అన్నారు బండి. ప్రభుత్వ తప్పుడు విధానాలతో ఆర్టీసీ కార్మికులు.. ఇంటర్ విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారని.. అయినా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. బీజేపీ మతతత్వ పార్టీ అని అంటున్నారు.. 80 శాతం ఉన్న హిందువుల కోసం పోరాటం చేయడం తప్పా అని ప్రశ్నించారు. పాతబస్తీ మాది.. తెలంగాణ మాది.. ఏ బస్తీకైనా వస్తాం.. ఏ గల్లీకైనా వస్తాం.. ఏ ఊరికైనా వెళ్తాం… మా చేతిలో ఉంది కాషాయ జెండా.. మా నాయకుడు నరేంద్ర మోడీ అని చెప్పుకొచ్చారు బండి సంజయ్.
తాలిబన్ల భావజాలం ఉన్న ఎంఐఎం పార్టీని.. దానికి సహకరిస్తున్న టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ నుంచి తరిమి కొట్టడమే బీజేపీ లక్ష్యమన్నారు బండి. బీజేపీ ఏ మతానికీ వ్యతిరేకం కాదని చెప్పారు. కానీ.. హిందూ ధర్మాన్ని కించపరిచినా.. చీల్చే ప్రయత్నం చేసినా చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. దళితులకు సీఎం పదవి ఇస్తానని.. బీసీలకు వందల కోట్లు ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు.
మతపరమైన రిజర్వేషన్లను అడ్డుపెట్టి ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేస్తున్న వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. రంజాన్ వస్తే ఇఫ్తార్ ఇస్తాం, బక్రీద్ వస్తే కలిసి పండుగ చేస్తాం.. ఏనాడూ బీజేపీ వ్యతిరేకించలేదు. కానీ.. దసరా, దీపావళి పండుగలొస్తే.. గణేష్ శోభాయాత్రను స్వాగతించిన ఎంఐఎం నాయకులను ఏమనాలని ప్రశ్నించారు. హిందుగాళ్లు, బొందుగాళ్లు అని విమర్శించిన కేసీఆర్ ను ఏమనాలని నిలదీశారు.
కేసీఆర్ నిజంగా హిందువైతే పాతబస్తీ గడ్డ నుండి శోభాయాత్రను, హనుమాన్ జయంతి యాత్రను నిర్వహించే దమ్ముందా అని సవాల్ విసిరారు. కేసీఆర్ నియంత, అవినీతి, కుటుంబ పాలనను పాతి పెట్టేందుకే ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నామన్న ఆయన… బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణను, పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అంతకుముందు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు. తొలుత పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి.. అక్కడి నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. తొలి రోజు పాదయాత్ర అఫ్జల్ గంజ్, నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం, లక్డీకపూల్ మీదుగా మెహిదీపట్నం వరకు సాగుతుంది. మెహిదీపట్నం పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాలలో రాత్రికి బస ఏర్పాటు చేశారు. రోజుకు 10 నుంచి 15 కిలోమీటర్ల చొప్పున 35 రోజులపాటు ఈ యాత్ర కొనసాగనుంది. అక్టోబర్ 2న హుజూరాబాద్ సభతో తొలివిడత ప్రజా సంగ్రామ యాత్ర ముగుస్తుంది. ఆ లోపు హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ వెలువడితే పాదయాత్ర రూట్ మ్యాప్ మారే అవకాశం ఉంది.