– నయా నిజాంను తరిమేద్దాం
– ప్రజాస్వామిక తెలంగాణ సాధిద్దాం
– ఏడేళ్లుగా కేసీఆర్ చేసిందేంటి?
– దళితుడ్నిముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు?
– దసరా ఉత్సవాల్నిఎందుకు జరపరు?
– రాబోయేది బీజేపీ ప్రభుత్వమే..
– అధికారికంగా దసరా సంబరాలు జరుపుతాం
– అక్బరుద్దీన్ కేసులన్నీతిరగదోడతాం..
– ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభంలో బండి
కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా కాషాయ దండు కదిలింది.బండి సంజయ్ అడుగులో అడుగేస్తూ కదం తొక్కింది. అలంపూర్ వేదికగా..జోగులాంబ తల్లి ఆశీస్సులతో రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభించారు బండి.రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ సహా కీలక నేతలందరూ పాల్గొన్నారు. ముందుగా జోగులాంబ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు.తర్వాత జరిగిన బహిరంగ సభలో సంజయ్ ప్రసంగించారు.
కేసీఆర్ గడీలను బద్దలు కొట్టేందుకు కాషాయ దండు కదం తొక్కాలన్నారు.మొదటి విడత పాదయాత్ర సమయంలో పాతబస్తీలో మీటింగ్ కు పర్మిషన్ అడిగితే..పోలీసులు ఇవ్వలేదన్నారు.తాము అడిగిన చోట పర్మిషన్ ఇస్తే ఆ ఒక్కచోటే పెడతాం..లేదంటే పాతబస్తీ మొత్తం మీటింగ్ పెడతామనేసరికి దిగొచ్చారని గుర్తు చేశారు.పాతబస్తీ మీటింగ్ తో ఓ ఉత్సాహం వచ్చిందని..ఇప్పుడు రెండో విడత పాదయాత్ర ప్రారంభించామని చెప్పారు.జోగులాంబ ఆలయంలో దసరా ఉత్సవాలు అధికారికంగా ఎందుకు చేయరని కేసీఆర్ ను నిలదీశారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని..అప్పుడు దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుతామని హామీ ఇచ్చారు. దసరా ఉత్సవాలు ఘనంగా చేస్తే మైనార్టీలు దూరమౌతారనే భయంలో కేసీఆర్ ఉన్నారన్నారు బండి.
అక్బరుద్దీన్ ను వదిలేది లేదని..బీజేపీ ప్రభుత్వం వచ్చాక కేసులన్నీతిరగదోడతామన్నారు.తెలంగాణలో హిందువు హిందువని చెప్పుకుంటే తప్పా?అని ప్రశ్నించారు.హిందువుల గురించి బీజేపీ మాట్లాడకుంటే వారి పరిస్థితేంటన్నారు.తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని..హిందూ ధర్మం జోలికొస్తే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు.తెలంగాణ రాష్ట్రంలో అయ్యప్ప, హనుమాన్ మాల వేస్తే డ్యూటీ, స్కూల్ కి రావొద్దనే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అలంపూర్ లో బస్టాండ్ కూడా లేదని.. ఇక్కడి ప్రజలు ఏం పాపం చేశారని నిలదీశారు బండి. వైద్యం కోసం రాయలసీమ, హైదారాబాద్ వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని మండిపడ్డారు. ప్రజలు ఏం కావాలని కోరుకుంటున్నారో తెలుసుకునేందుకే ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టామన్నారు. ఈ పాదయాత్రలో కేంద్రం ఇస్తున్న పథకాలను వివరిస్తామని.. అలాగే కేసీఆర్ మోసాల గురించి చెబుతామని తెలిపారు. ఏడేళ్లుగా కేసీఆర్ ఏం చేశారన్న బండి.. ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి మెడలు వంచైనా వడ్లు కొనిపిస్తామని చెప్పామని.. అన్నట్లుగా చేసి చూపించామన్నారు.
తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే తాము చూస్తూ ఊరుకోమనే హెచ్చరించేందుకే అంబేద్కర్ జయంతి నాడు పాదయాత్ర చేపట్టామన్నారు సంజయ్. దళితుడ్ని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. మూడెకరాలు ఎందుకు ఇవ్వలేదని అడిగారు. కేసీఆర్ తన కుటుంబాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకుంటున్నారని విమర్శించారు. నియంత పాలన పోవాలి.. నయా నిజాం పాలన పోవాలి.. కుటుంబ పాలనకు చరమగీతం పాడదామని చెప్పారు. గడీల పాలనను బద్దలు కొట్టేందుకు.. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం చేసుకునేందుకు.. బీజేపీ చేపట్టిన ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు బండి సంజయ్.