– హామీలు నెరవేర్చమంటే దాడులా?
– ఇదెక్కడి న్యాయం
– గౌరవెల్లి ప్రాజెక్ట్ బాధితులకు అండగా ఉంటాం
– గవర్నర్ కు అన్నీ వివరించాం
– ప్రభుత్వంపై బండి నిప్పులు
గౌరవెల్లి ప్రాజెక్ట్ ఘటనను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో బాధితులతో కలిసి గవర్నర్ తమిళిసై కి కమలనాథులు ఫిర్యాదు చేశారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరితే భూ నిర్వాసితులపై విచక్షణారహితంగా పోలీసులతో లాఠీచార్జ్ చేయించి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ ఫైరయ్యారు. నిర్వాసితుల్లో మహిళలు, బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.
భూ నిర్వాసితులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీస్ అధికారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలని గవర్నర్ ను కోరినట్లు చెప్పారు. అలాగే భూనిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చి వారి సమస్యలను పరిష్కరించాలని వేడుకున్నట్లు తెలిపారు. గండిపెల్లి ప్రాజెక్టు పూర్తిచేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశామన్నారు.
మరోవైపు రాష్ట్రంలో సర్పంచ్ లు, ఎంపీటీసీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న దుస్థితిపై గవర్నర్ కు మెమోరాండం సమర్పించారు బీజేపీ నాయకులు. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా సర్పంచుల అధికారాలకు కత్తెర వేస్తూ గ్రామ స్వరాజ్యం లక్ష్యాలను నీరు గారుస్తోన్న టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై ఫిర్యాదు చేశారు.
సర్పంచ్ లను, ఉప సర్పంచ్ లకు మధ్య టీఆర్ఎస్ సర్కారు గొడవ పెట్టిందని,..సర్పంచ్ లను అప్పుల పాలు చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. బిల్లుల అడిగితే సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారని.. కేంద్ర ప్రభుత్వ నిధులను తెలంగాణ ప్రభుత్వం డైవర్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యవక్తం చేశారు.