రాజకీయ పార్టీలన్నింటికి నిరుద్యోగ సమస్యే ఎజెండా కావాలి
దీక్షను సక్సెస్ చేసి నిరుద్యోగులకు భరోసా కల్పిద్దాం
ఉద్యోగుల రీఅలాట్ మెంట్, ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపైనా సర్కార్ ను నిలదీద్దాం
విద్యార్థి, యువజన, ఉద్యోగ, నిరుద్యోగ సంఘాలన్ని దీక్షకు మద్దతివ్వండి
నిరుద్యోగ సంఘాల భేటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ పిలుపు
నిరుద్యోగ దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన నిరుద్యోగ సంఘాల నాయకులు
కేసీఆర్ ప్రభుత్వం దిగొచ్చే విధంగా ఈనెల 27న ఇందిరాపార్క్ వద్ద ‘నిరుద్యోగ దీక్ష’ చేపడుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు నిరుద్యోగ సమస్యే ఎజెండాగా మారాలని కోరారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువరించేదాకా బీజేపీ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. నిరుద్యోగ దీక్షను కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేసి నిరుద్యోగులకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. జోనల్ కేటాయింపుల్లో భాగంగా ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపైనా, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలపైనా ఈ దీక్షా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు. ఈ నేఫథ్యంలో రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల విద్యార్థి, యువజన, ఉద్యోగ, నిరుద్యోగ, ప్రజా సంఘాల నాయకులంతా రాజకీయాలకు అతీతంగా ‘నిరుద్యోగ దీక్ష’కు తరలివచ్చి సంఘీభావం తెలపాలని కోరారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులతో బండి సంజయ్ సమావేశమయ్యారు. మాజీమంత్రులు డాక్టర్ చంద్రశేఖర్, బాబూమోహన్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి తదితరులు హాజరైన ఈ సమావేశంలో 15 నిరుద్యోగ సంఘాల నాయకులు పాల్గొని బీజేపీ ‘నిరుద్యోగ దీక్ష’కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ పాలనలో ఉద్యోగాల్లేక నిరుద్యోగ యువత ఎన్నో ఇబ్బందులు పడుతోంది. తినడానికి తిండిలేక కోచింగ్ తీసుకోవడానికి డబ్బుల్లేక నానా కష్టాలు పడుతున్న విషయం నేను కళ్లారా చూశాను. నా పాదయాత్రలో నిరుద్యోగులు ఎక్కడికక్కడ తరలి వచ్చి బాధలు చెప్పుకుంటుంటే గుండె తరుక్కుపోయింది. ఉద్యోగాల్లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధేస్తోంది. ఆనాడు తెలంగాణ కోసం యువత ఆత్మహత్యలు చేసుకుంటే.. ఈనాడు ఉద్యోగాల్లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇకనైనా ఆత్మహత్యలు ఆగాలి. నిరుద్యోగులకు అండగా ఉంటామనే భరోసా కల్పించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈనెల 27న ‘నిరుద్యోగ దీక్ష’ చేపడుతున్నాం.’’అని తెలిపారు.
బీజేపీ అంటే కేసీఆర్ కు భయమని.. బీజేపీతో టీఆర్ఎస్ ప్రభుత్వానికే ఎసరొచ్చే ప్రమాదముందని భయపడుతున్నారని అన్నారు. అందుకే నిరుద్యోగ సమస్యను దారి మళ్లించేందుకు కొత్త సమస్యను సృష్టిస్తున్నాడని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేసీఆర్ లేనిపోని రాద్దాంతం చేస్తున్నారని.. ఆ ట్రాప్ లో పడొద్దని సూచించారు. ఇప్పుడు కేసీఆర్ కు నిరుద్యోగుల సత్తా ఏంటో చూపాల్సిన సమయం ఆసన్నమైందని సంజయ్ పిలుపునిచ్చారు. ఇప్పుడు మేల్కోకపోతే.. కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలం నోటిఫికేషన్లు వెలువడే అవకాశమే ఉండదని అన్నారు. నిరుద్యోగ దీక్ష పేరుతో ప్రభుత్వం మెడలు వంచి నోటిఫికేషన్లు వెలువరించేలా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు.
నిరుద్యోగ దీక్ష వేదికగా జోనల్ వ్యవస్థలో భాగంగా జరుగుతున్న ఉద్యోగుల రీఅలాట్ మెంట్ ప్రక్రియలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు జరుగుతున్న అన్యాయంపైన, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలపైన, ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డ వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని బండి తెలిపారు.
‘‘నిరుద్యోగ దీక్షకు మీరంతా మద్దతివ్వండి. అన్ని వర్శిటీల విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగ సంఘాల నాయకులను కలిసి దీక్షకు తరలివచ్చేలా ప్రణాళిక రూపొందించండి. వీరితోపాటు కేసీఆర్ పాలనలో ఉద్యోగాలు కోల్పోయిన విద్య వలంటీర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, స్కూల్ స్కావెంజర్స్, వైద్య సిబ్బందిని కలవండి. కేసీఆర్ వల్ల ఇబ్బంది పడుతున్న వీఆర్వోలను, జోనల్ వ్యవస్థ బదిలీలతో సతమతమవుతున్న ఉద్యోగులను, కరోనాతో ఉద్యోగాలు కోల్పొయిన యువతను కలిసి దీక్షకు తరలివచ్చేలా చేయండి’’అని సంజయ్ కోరారు.
ఈ సందర్భంగా నిరుద్యోగ సంఘాల జేఏసీ నాయకులు స్పందిస్తూ నిరుద్యోగ సమస్యపై పోరాడుతున్న బండి సంజయ్ ను అభినందించారు. నిరుద్యోగ దీక్షకు ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్ యూ దాకా ప్రతి ఒక్కరినీ కదిలించేలా సమాయాత్తమవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కళ్యాణ్ నాయక్, జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సంపత్ నాయక్, దక్షిణ తెలంగాణ జేఏసీ చైర్మన్ కల్వకుర్తి ఆంజనేయులు, ఓయూ జేఏసీ అధ్యక్షుడు లింగస్వామి, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్, విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు శివప్రసాద్, నిరుద్యోగ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ శ్రీకాంత్, బీడీ నిరుద్యోగ సంఘం నాయకులు మధుసూదన్ రెడ్డి, రాజేష్ నాయక్, ఓయూ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాజు నేత, ఓయు జెఏసి వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణకాంత్ సహా పలువురు విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.