ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో స్పష్టమైన మెజార్టీ సాధించింది. దీంతో ఆపార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. తెలంగాణలోని రాష్ట్ర కార్యాలయంలో నేతలు, కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ, మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.
సంబరాల అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ ఫలితాలతో రాష్ట్రంలోని కార్యకర్తల్లో మరింత ఉత్సాహం పెరిగిందని చెప్పారు.
ఎన్నికలు అవ్వగానే బీజేపీ పనైపోయిందని చెప్పిన వారి అంచనాలు తలకిందిలయ్యాయన్నారు బండి. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం రావాలని చెప్పారు. యూపీలో 35 ఏళ్ల చరిత్రను యోగి తిరగరాశారని కొనియాడారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉందో రాష్ట్రంలో అదే ఉంటే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు నమ్మారని తెలిపారు. యోగీది అవినీతి రహిత పాలన అని ప్రశంసించారు.
కేంద్ర ఇచ్చే నిధులను దారి మళ్లించడం.. సంక్షేమ పథకాలను నీరుగార్చుతుండడంతో తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కేంద్రాన్ని బద్నాం చేయాలని కేసీఆర్ చేసే ప్రయత్నాన్ని ప్రజలు గుర్తించాలని చెప్పారు. బీజేపీ సెగతోనే సీఎం ఫాంహౌస్ వదలి జిల్లాలు, రాష్ట్రాలు తిరుగుతున్నారని విమర్శించారు.
కేసీఆర్ అవినీతిపై ఎప్పటికైనా విచారణ జరుగుతుందని తెలిపారు బండి. కేసీఆర్ అరెస్ట్ తప్పదని.. తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టిందని చెప్పారు. ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ ఓటింగ్ శాతం పెరిగుతోందన్నారు బండి. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ.. కేసీఆర్ మాటలకు కోతలు ఎక్కవ అని ఎద్దేవ చేశారు.
యూపీలో కేసీఆర్ పోస్టర్లు ఏర్పాటు చేసుకున్నారని.. అక్కడి ప్రజలు ఈ విచిత్ర మనిషి ఎవరని అనుకున్నారన్నారు సంజయ్. ఎక్కడైనా ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు వెళ్లాలి కానీ.. సీఎం ఎక్కడకు వెళ్లారో చూశామని చురకలంటించారు. తాజా ఫలితాలతో కేసీఆర్ ఫాంహౌస్ షేక్ అవుతోందని విమర్శించారు బండి సంజయ్.