విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో కేంద్రంపై మండిపడ్డారు. ప్రధానిని సేల్స్ మెన్ అని విమర్శించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. మోడీని కేసీఆర్ అవమానించారని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. దేశ ప్రజలు కేసీఆర్ ను క్షమించరని ఫైరయ్యారు.
ప్రధాని మోడీ సేల్స్‌మెనే.. ప్రజలను ఆదుకోవడంలో సేల్స్ మెన్ గా వ్యవహరిస్తారని అన్నారు సంజయ్. కరోనా టీకా అందించడంలో సేల్స్ మెన్ గా వ్యవహరించారని గుర్తు చేశారు. ఆ సమయంలో కేసీఆర్ ఫాంహౌస్ లో ఉన్నారని సెటైర్లు వేశారు. ప్రజలు ఏ సమస్యల్లో ఉన్నా ముఖ్యమంత్రికి పట్టదని విమర్శించారు.
కేసీఆర్ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని.. ఆయనలో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే.. తెలంగాణ కారమే తింటే.. బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టి చూపించాలని సవాల్ చేశారు బండి. కేసీఆర్ పాలనలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల విచ్చలవిడితనం పెరిగిపోయిందని విమర్శించారు. శాంతి భద్రతలు క్షీణించాయని, క్రిమినల్స్ రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. తెలంగాణ హత్యలు, అత్యాచారాలు, భూ కబ్జాలు, ల్యాండ్, శాండ్, మాదకద్రవ్యాల మాఫియాకు అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు.
రాష్ట్రపతి ఎన్నికల వ్యవస్థనే కేసీఆర్ కించపరుస్తున్నారని విమర్శించారు. ‘‘రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రజలేమైనా ఓట్లేస్తారా? అవేమైనా సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలా? ర్యాలీలు తీస్తూ ఫ్లెక్సీలు కడుతూ గౌరవప్రదమైన ఆ వ్యవస్థ స్థాయిని దిగజారుస్తారా?’’ అని ప్రశ్నించారు.