- పక్కా ప్రణాళిక ప్రకారమే విధ్వంసకాండ..
- బండి సంజయ్ ఫైర్..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన హింసాత్మక ఘటన పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని బిజెపి తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. బాసర వెళ్తూ మార్గమధ్యలో బిక్కనూరులో వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అగ్నిపథ్ కు వ్యతిరేకంగా టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి చేసిన కుట్రలో భాగంగానే అల్లర్లు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఆర్మీకి సన్నద్ధమవుతున్న అభ్యర్ధుల ముసుగులో కొందరు వచ్చి ఆందోళనలు చేపట్టి.. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. అగ్నిపథ్ ముసుగులో అభ్యర్ధులకు కేంద్రం ఆన్యాయం చేయాలని చూడటం లేదు. విద్యార్ధులు ఇలాంటి దాడులకు పాల్పడతారని భావించట్లేదు.
నిన్న కాంగ్రెస్ దాడి, నేడు రైల్వేస్టేషన్ పై దాడిని టీఆర్ఎస్ ప్రోత్సహిస్తోందని,.. కేంద్రం ప్రతిష్టను రాష్ట్ర ప్రభుత్వం దిగజార్చే ప్రయత్నం చేస్తోందని సంజయ్ వ్యాఖ్యానించారు. అసలు ఆందోళనకారులు రైల్వేస్టేషన్ పై దాడికి వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నట్టు..? రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది..? అని బండి ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం హింసను ప్రోత్సహిస్తోందని.. ఇంత విధ్వంసం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు సంజయ్. కచ్చితంగా బుల్డోజర్ ప్రభుత్వం వస్తేనే ఇలాంటి వారి ఆటలకు అడ్డుకట్టపడుతుందని తెలిపారు.