బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ పై కేసు నమోదైంది. తాను చదివే కాలేజీలో విద్యార్థిని ర్యాగింగ్ చేస్తూ.. దాడికి పాల్పడ్డాడని సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యింది. ఈ క్రమంలోనే అతడిపై ఐపీసీ 341, 323, 504, 506, 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై బండి సంజయ్ స్పందించారు. రాజకీయం చేస్తే తనతో చెయ్యాలన్నారు. తనతో రాజకీయం చేయలేక తన కుమారుడ్ని కేసులో ఇరికించారని అసహనం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ మనవడిపై వేరేవాళ్లు కామెంట్స్ చేస్తే తాను వ్యతిరేకించానని గుర్తుచేశారు. తనకు ఆ జ్ఞానం ఉందన్నారు. తన కుమారుడిపై క్రిమినల్ కేసు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు.
పిల్లలు పిల్లలు కొట్టుకుంటే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని ఫైరయ్యారు బండి. కేసు పెట్టాల్సిన అవసరం ఏమి వచ్చిందని.. ఎవరు ఫిర్యాదు చేశారని ప్రశ్నించారు. రాజకీయాల కోసం, ప్రజలను దృష్టి మళ్లించేందుకు తన కుమారుడిపై కేసు పెట్టారని మండిపడ్డారు.
మరోవైపు బాధితుడు ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశాడు. తప్పంతా తనదేనని ఒప్పుకున్నాడు. బండి కుమారుడు కొట్టిన మాట వాస్తవమేనని.. కాకపోతే తాను ఓ అమ్మాయితో తప్పుగా బిహేవ్ చేయడం వల్లే అలా చేశాడని చెప్పాడు. అంతేకాదు.. ప్రస్తుతం తాము మంచి స్నేహితులుగా ఉంటున్నామని.. ఈ వీడియో పాతదని అనవసరం రాద్ధాంతం చేయొద్దని కోరాడు.