బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై పోరుబాటకు దిగుతోంది బీజేపీ. గురువారం ఇందిరాపార్క్ లో ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’’ చేయనుంది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంత్రి శ్రీనివాసులు, ప్రేమేందర్ రెడ్డి సహా పలువురు నేతలు సమావేశమయ్యారు. దీక్షపై చర్చించారు.
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ దీక్షలో ఎమ్మెల్యేలు రాజాసింగ్, రాజేందర్, రఘునందన్ పాల్గొంటారని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. అలాగే ఎంపీలు సోయం బాపురావు, ధర్మపురి అరవింద్ తోపాటు పార్టీ రాష్ట్ర పదాధికారులు ఇతర కీలక నేతలు హాజరవుతారని ప్రకటన విడుదల చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని మంట కలుపుతోందనడానికి, పార్లమెంటరీ సాంప్రదాయాలను తుంగలో తొక్కుతోందనడానికి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ నిదర్శనమన్నారు సంజయ్. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సరిదిద్దుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలంటూ హైకోర్టు సూచించినప్పటికీ పెడచెవిన పెట్టడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు.
రాజ్యాంగబద్దంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన స్పీకర్ టీఆర్ఎస్ కు తొత్తులా మారడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని అభిప్రాయపడ్డారు బండి. తెలంగాణలో మంటగలిసిన రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు బీజేపీ తెలంగాణ శాఖ చేపడుతున్న ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, విద్యావేత్తలతోపాటు ప్రజా సంఘాల నాయకులంతా తరలివచ్చి మద్దతు తెలిపాలని కోరారు. ఇటు ఈటల రాజేందర్ కూడా ఈ దీక్షలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.